నంద్యాల బరి నుంచి ‘భూమా’ ఔట్‌!

11 Nov, 2023 10:15 IST|Sakshi

‘భూమా’ పేరు రాజకీయాల నుంచి కనుమరుగు కానుందా? నంద్యాల బరిలో నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని కాకుండా ఫరూక్‌ను బరిలోకి దించనున్నారా? ఆళ్లగడ్డలో కూడా అఖిల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా? టీడీపీలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, ఇన్‌చార్జ్‌లతో ఆ పార్టీ అధినేతలు సాగిస్తున్న చర్చలు ఈ విషయాలనే వెల్లడి చేస్తోంది. పార్టీ నిర్ణయంతో భూమా బ్రహ్మనందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

సాక్షి ప్రతినిధి కర్నూలు: రాయలసీమలో టీడీపీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. గత 20 ఏళ్లలో ఇక్కడ టీడీపీ అత్యధికంగా గెలిచింది నాలుగు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందో టీడీపీ అధిష్టానానికి కూడా స్పష్టంగా తెలుసు. పైగా టీడీపీ రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ సంస్థ చేసిన సర్వేల్లో కూడా కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని స్పష్టమైనట్లు సమాచారం. ఈ క్రమంలో టిక్కెట్ల ఖారారుపై టీడీపీ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. డోన్‌ పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని ఇదివరకే ప్రకటించారు.

 అయితే డోన్‌ బరిలో కచ్చితంగా కేఈ కుటుంబం ఉంటుందని, పోటీ చేసి తీరుతుందని కేఈ ప్రభాకర్‌ తేల్చిచెప్పారు. ఈ టిక్కెట్‌ బీసీ జనార్దన్‌రెడ్డి సూచన మేరకే చంద్రబాబు ప్రకటించారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో నంద్యాల నుంచి భూమా బ్రహ్మనందరెడ్డిని తప్పించేందుకు బీసీ జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భూమా బ్రహ్మనందరెడ్డిపై చంద్రబాబుకు ప్రతీ సందర్భంలో కూడా ఫిర్యాదులు చేశారు. ఇది గ్రహించిన బ్రహ్మం ఇటీవల నంద్యాలకు వచ్చి అరెస్టయ్యే ముందురోజు బీసీ జనార్దన్‌రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. దీంతో నంద్యాల బహిరంగసభలో బ్రహ్మం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ‘భూమా’ అనుచరులు నినాదాలు చేసినా చంద్రబాబు ఎవ్వరి పేరు ప్రకటించనని, సర్వేలను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో ఫరూక్‌ను నంద్యాల అభ్యర్థిగా టీడీపీ దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీని వీడాలని బ్రహ్మం నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలోనే చర్చ కొనసాగుతోంది. ఇది తెలిసి టీడీపీ అధిష్టానం ఫరూక్, బ్రహ్మంలను పిలిపించి ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు బ్రహ్మం ససేమిరా అని మధ్యలోనే లేచి వచ్చేశాడని సమాచారం. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. 

ఎలాగూ ఓటమి తప్పదని జనసేనకు.. 
ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా ఆళ్లగడ్డలో గెలిచే పరిస్థితులు లేకపోవడం, మరోవైపు బలిజ ఓటర్లు అధికంగా     ఉండటంతో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కట్టబెడదామనే నిర్ణయానికి టీడీపీ వచ్చినట్లు తెలిసింది. ఎలాగూ ఓడిపోయే సీటు, పొత్తులో ఇస్తే సరిపోతుంది, పైగా బలిజలు అధికంగా ఉన్నారు కాబట్టి ఆళ్లగడ్డ లాంటి కీలక స్థానం జనసేనకు ఇచ్చామని చెప్పుకునేందుకు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఇరిగెల రాంపుల్లారెడ్డి జనసేన పార్టీటలో చేరారు. 

పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్‌ తనకే వస్తుందని ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆళ్లగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్‌ ఇస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కించుకునేంత శక్తి తన నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గంలో లేరని, కాబట్టి టిక్కెట్‌ తనకే వస్తుందని ఇరిగెల తన వర్గీయులతో చెబుతుండటం గమనార్హం. ఏదిఏమైనా ఓ వైపు నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి, మరోవైపు ఆళ్లగడ్డలో అఖిల ప్రియకు టిక్కెట్లు దక్కకపోతే ‘భూమా’ కుటుంబం తొలిసారి పోటీలో లేని పరిస్థితి తలెత్తుంది. ఇదే జరిగితే రాజకీయాల్లో ‘భూమా’ కుటుంబం తెరమరుగైనట్లే! 

స్వయంకృతాపరాధం
భూమా బ్రహ్మనందరెడ్డికి కాకుండా తన సోదరుడు జగత్‌ విఖ్యాత్‌కు టిక్కెట్‌ దక్కించుకోవాలని అఖిల శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అఖిల, బ్రహ్మనికి మధ్య విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. ఇద్దరి విభేదాలతో పరస్పరం బలాన్ని తగ్గించుంటున్నామనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఘోర పరాభవం తప్పదని రాబిన్‌శర్మ టీం అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీంతో అఖిలకు కాకుండా భూమా కిషోర్‌ను టీడీపీలోకి ఆహ్వానించి టిక్కెట్‌ ఇవ్వాలని ఆ పార్టీ తొలుత భావించింది. అయితే కిషోర్‌కు ఇచ్చినా అఖిల వర్గం మద్దతు ఇవ్వదని గ్రహించింది.

 ప్రజల్లో నిత్యం ఉంటూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తోన్న ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ద్వయం చేతిలో కిషోర్‌ కూడా ఓటమిని తప్పించుకోలేరని తేలినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో 45వేల బలిజ సామాజికవర్గం ఓటర్లు ఉన్నారని, వారికి టిక్కెట్‌ ఇద్దామనే ఓ చర్చ నడిచింది. దీనికి బీసీ జనార్దన్‌రెడ్డి కూడా మద్దతు పలికినట్లు సమాచారం. ఇదే క్రమంలో బోండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెకు టిక్కెట్‌ ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అయితే ఈ నిర్ణయం కూడా గెలుపును దక్కించుకునేది కాదని తేలినట్లు చర్చ జరుగుతోంది. 

అఖిలకు అందరూ దూరమే.. 
► నాగిరెడ్డి మృతి తర్వాత రాజకీయంగా కీలకంగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే దూరమయ్యాడు. 
► ‘భూమా’కు అత్యంత సన్నిహితుడు శివరామిరెడ్డి, విజయడైరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డి, అఖిల పెదనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో పాటు బంధువర్గం, సన్నిహితులు ఆ గుమ్మం తొక్కడమే మానేశారు. 

► ‘భూమా’ కుటుంబం సొంత మండలం దొర్నిపాడులోనే వారికి వ్యతిరేకంగా సర్వేలు వచ్చాయంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు