సిటీ సెక్యూరిటీ వింగ్‌కి రూ.110 కోట్లు

10 Apr, 2016 00:57 IST|Sakshi

డెప్యుటేషన్‌పై 494 మంది పోలీసులు
ప్రత్యేక భవనం అన్వేషణలో కమిషనరేట్ పోలీసులు
ఏడాదిలో పూర్తిస్థాయిలో ఏర్పాటు!
బాంబ్ స్క్వాడ్ నుంచి అధునాతన పరికరాల వరకు
వీఐపీల భద్రతే ప్రధాన అజెండాగా కార్యకలాపాలు

 

విజయవాడ : సీఎం సహా వీవీఐపీలు, వీఐపీల భద్రతే లక్ష్యంగా సిటీ సెక్యూరిటీ వింగ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న కొత్త పోలీసు రక్షక దళానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. మొదటి విడతలో 583 మంది సిబ్బందితో ఏర్పాటుకానున్న ఈ వింగ్ భవిష్యత్తు అవసరాలకనుగుణంగా మరింత విస్తరించనుంది. భద్రతకు అవసరమయ్యే అధునాతన పరికరాలతో పాటు వీవీఐపీల కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా సమకూరనున్నాయి. కొత్త భవనం, పరికరాల ఏర్పాటు కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.

 
డెప్యుటేషన్ పైనే...

ఈ వింగ్‌కి కేటాయించిన  సబ్బందిలో డీసీపీ కేడర్ నుంచి ఎస్‌ఐ కేడర్ వరకు సిబ్బంది అంతా ఇతర రేంజిలు, ఏఆర్, వివిధ బెటాలియన్ల నుంచి బదిలీపై మరో నెలరోజుల వ్యవధిలో రానున్నారు. మిగిలిన 494 మంది కానిస్టేబుళ్లను ఇతర జిల్లాలు, బెటాలియన్ల నుంచి డెప్యుటేషన్‌పై తీసుకోనున్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉండటమే దీనికి కారణం. ఇప్పటికే  వీరిని పంపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సిబ్బంది వచ్చేలోపు తాత్కాలిక భవన అన్వేషణలో కమిషనరేట్ అధికారులు నిమగ్నమయ్యారు. ఏఆర్ గ్రౌండ్స్, కమిషనర్ ప్రాంగణంలో ఉన్న భవనాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నూతన కార్యాలయంలో డీసీపీ చాంబర్‌తో పాటు ఏడీసీపీ, ఏసీపీ కార్యాలయాలు, మిగిలిన సిబ్బందికి కార్యాలయం, ఐటీ వింగ్‌కు ప్రత్యేకంగా ఒక చాంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవనానికి రూ.10 కోట్లు, అధునాతన పరికరాల కొనుగోలుకు మిగిలిన రూ.100 కోట్లు కేటాయించనున్నారు. వీటిలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు, బాంబు స్క్వాడ్, డిస్పోజల్ టీమ్స్, యాంటీ సెర్చ్ టచ్ సెల్, రోప్ పార్టీ, డాగ్ స్క్వాడ్, స్లిపర్ డాగ్ స్క్వాడ్, అడ్వాన్స్‌డ్ టీమ్స్, ఏఎస్‌ఎల్ టీమ్స్, కంట్రోల్ రూమ్ తదితరాలు ఏర్పాటు కానున్నాయి.

 
అమరావతిలో మరింత విస్తరణ

మరో ఏడాది కాలవ్యవధిలో ఏర్పాటు కానున్న అమరావతి కమిషనరేట్ అవసరాల దృష్ట్యా రెట్టింపు స్థాయిలో విస్తరణ జరగనుంది. అమరావతి కమిషనరేట్ ఏర్పాటయ్యేలోగా విజయవాడలో సిటీ సెక్యూరిటీ వింగ్‌ను ఏర్పాటు చేసి మెరుగైన ఫలితాలు రాబట్టాలని నిర్ణయించారు. వింగ్‌లోని సిబ్బం దికి వివిధ అంశాలపై నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వింగ్ పూర్తిగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో సమన్వయం చేసుకొని పనిచేయనుంది.

మరిన్ని వార్తలు