జీవీఎంసీ ఎన్నికలకు ఎమ్మెల్యేలే సైంధవులు!

3 Dec, 2015 23:24 IST|Sakshi

కౌన్సిల్ ఏర్పడితే తమ ఆటలు సాగవని ఆందోళన
ఎన్నికలు వద్దంటూ సీఎంపై ఒత్తిడి
{పజాగ్రహానికి గురికావల్సి వస్తుందని సీఎం కూడా వెనుకంజ
ఏడాది వరకు నిర్వహించ  కూడదని అనధికారికంగా నిర్ణయం

 
ప్రజాగ్రహానికి గురికావల్సి వస్తుందేమోనని వెనుకంజ వేస్తున్న సీఎం... మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని సందేహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు... ఇదీ జీవీఎంసీ ఎన్నికల నిర్వహణపై సీఎం, ఎమ్మెల్యేల వైఖరి... ఏమైతేనేం... అటు సీఎం ఇటు ఎమ్మెల్యేలు జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు గ్రహణం పట్టిస్తున్నారు. జీవీఎంసీ ఎన్నికలు మరో ఏడాదిపాటు నిర్వహించకూడదని ప్రభుత్వం అనధికారికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహించకూడదన్న ప్రభుత్వ యోచన వెనుక అసలు మతలబు ఇదీ...
 
విశాఖపట్నం :  మూడు వర్గాలు ఆరు కలహాలుగా ఉన్న నగర ఎమ్మెల్యేలు ఒక్క విషయంలో మాత్రం ఏకతాటిపైకి వచ్చారు. జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవడంలో మాత్రం  ఏకాభిప్రాయంతో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా సీఎం చంద్రబాబు జీవీఎంసీ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు.  జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించవద్దని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఎన్నికలు నిర్వహిస్తే మేయర్, కార్పొరేటర్ల ప్రాబల్యం పెరుగుతుంది. ఆ ఊహకే ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు. తమ నియోజకవర్గ పరిధికి సంబంధించినంతవరకు జీవీఎంసీ పూర్తిగా తమ ఆధీనంలో ఉండాలని వారు కోరుకుంటున్నారు. స్మార్ట్‌సిటీ నిధులు భారీగా వస్తాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆ నిధులపై కన్నేసిన ఎమ్మెల్యేలు అన్ని పనులు
 తామే దక్కించుకోవాలన్నది వారి ఉద్దేశం. మేయర్‌గానీ కార్పొరేటర్లుగాని వస్తే తమ నియోకజకవర్గాల్లోనే మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని ఎమ్మెల్యేలు సందేహిస్తున్నారు. అందుకే అసలు ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
 
ఏడాది వరకు ఉండవు: ఎమ్మెల్యేలకు సీఎం అభయం

 కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే జీవీఎంసీ ఎన్నికలకు వెళితే ఎక్కడ ప్రజాగ్రహానికి గురికావల్సి వస్తుందోనని ఆయన వెనుకంజ వేస్తున్నారు. కాని ఆ విషయాన్ని బయటపడనీయకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు కూడా తమ ప్రయోజనాల కోసం జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించవద్దని పట్టుబడుతున్నారు.  ఎమ్మెల్యేల మీద నెపం పెట్టేసి మరో ఏడాది వరకు ఎన్నికలు నిర్వహించకూడదని అనధికారికంగా నిర్ణయించారు. దాంతో ఎమ్మెల్యేలు ఖుషీ అయిపోతున్నారు. ‘మరో ఏడాది వరకు జీవీఎంసీ ఎన్నికలు లేవు..  అంతా మా కనుసన్నల్లోనే సాగుతుంది’అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయాయి. మరో ఏడాది వరకు ఎన్నికలు లేవని తేలిపోయింది. అంటే అప్పటికే దాదాపు మూడేళ్లు గడిచిపోతాయి. ఆ తరువాత మరో వ్యూహంతో మిగిలిన రెండేళ్లు కూడా ఎన్నికలు నిర్వహించకుండా కాలం వెళ్లదీయొచ్చన్నది ఎమ్మెల్యేల యోచన.   అటు సీఎం చంద్రబాబు... ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించకుండా సైంధవపాత్ర పోషిస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు