గోరుముద్ద నాణ్యతకు ప్రత్యేక యాప్‌

29 Feb, 2020 05:39 IST|Sakshi
పాఠశాల విద్యాశాఖపై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏ పాఠశాల నుంచి ఫిర్యాదు అందినా వెంటనే స్పందించాలి

పాఠశాల విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

మధ్యాహ్న భోజనంలో నూతన మెనూను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి

విద్యా కానుక కిట్స్‌ సకాలంలో పంపిణీ కావాలి

విద్యార్థులను ఆకట్టుకునేలా స్కూళ్ల రూపురేఖలు మారాలి

మానసిక వికలాంగుల కోసం నియోజకవర్గానికొక స్కూలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత ఒకేరకంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ఎక్కడా నిర్లక్ష్యం, అజాగ్రత్త ఉండరాదని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని దిశానిర్దేశం చేశారు. పాఠశాల విద్యా శాఖపై  శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో విద్యార్థులకు అందిస్తున్న పుష్టికరమైన, రుచికరమైన మధ్యాహ్న భోజన పథకం మరింత సక్రమంగా అమలయ్యేందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వివరించారు.  

కొత్త మెనూ వివరాలు, ఏ రోజు ఏ మెనూ అమలవుతుందో ఈ యాప్‌లో స్పష్టంగా పొందు పరుస్తామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. మధ్యాహ్న భోజనంలో ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే యాప్‌లో తెలియజేసేలా ఉండాలన్నారు. ఆ తర్వాత వెంటనే సంబంధిత ఉన్నతాధికారి సమస్య పరిష్కరించాలని చెప్పారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ ఉండాలని సూచించారు. ఏదైనా స్కూల్‌ మెనూలో తేడా వచ్చినట్లు ఫిర్యాదు అందగానే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

విద్యార్థులందరికీ చిక్కీ అందుతోందా?
మధ్యాహ్న భోజనంలో పిల్లలందరికీ చిక్కీ అందుతోందా.. అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో ఇస్తున్నామని అధికారులు తెలిపారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రవేశపెట్టిన కొత్త మెనూ అమలు స్కూళ్లలో సత్ఫలితాలనిస్తోందని వివరించారు. కొత్త మెనూ అమలులో ఏమైనా ఇబ్బందులెదురవుతున్నాయా.. అని ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. 

విద్యారంగం నుంచే మార్పు ప్రారంభం 
మార్పు అనేది విద్యారంగం నుంచే ప్రారంభం కావాలని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. తద్వారా  సమాజంలో మంచి మార్పులకు పునాది పడుతుందన్నారు. మోరల్స్, ఎథిక్స్‌ అనే క్లాస్‌లు పాఠశాలల్లో ఉండాలని, ఇవి విద్యార్థులకు చాలా ముఖ్యమని సీఎం ఉద్బోధించారు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల ఏర్పాటుపై ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుధ్యం పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. టీచర్లకు ఇస్తున్న శిక్షణ, నూతన కరిక్యులమ్‌ తదితరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీచర్లకు శిక్షణ, కరిక్యులమ్, వర్క్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాల విషయంలో అధికారులు తీసుకున్న చర్యలను సీఎం అభినందించారు.

విద్యా కానుక కిట్స్‌లో నాణ్యత ముఖ్యం
జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్స్‌లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నాణ్యమైన వస్తువులు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కిట్స్‌ కింద అందించే యూనిఫామ్‌ క్లాత్‌ (3 జతలు కుట్టించుకునేందుకు వీలుగా), నోట్‌బుక్స్, షూస్‌ అండ్‌ సాక్స్, బెల్ట్, బ్యాగ్‌కు అదనంగా టెక్ట్స్‌బుక్స్‌ను కూడా కలపాలని సీఎం ఆదేశించారు. కిట్స్‌కు సంబంధించి కాంపిటీటివ్‌ టెండర్లు పిలిస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని సూచించారు. ఈ ప్రొక్యూర్‌మెంట్, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని అధికారులు పేర్కొనగా క్వాలిటీ విషయంలో రాజీ వద్దని నొక్కి చెప్పారు. ఎక్కడా జాప్యం జరగకుండా నిర్ణీత కాల వ్యవధిలో పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్‌ను సీఎం పరిశీలించారు. 

ప్రతి స్కూలు సర్వాంగ సుందరంగా మారాలి
పాఠశాలల్లో నాడు–నేడు కింద ప్రారంభమైన పనుల గురించి సీఎం అధికారులను ఆరా తీశారు. అన్ని చోట్లా పనులు ప్రారంభమయ్యాయా? ఎన్ని స్కూళ్లలో పనులు ప్రారంభించారు? ఇంకా ఎన్ని చోట్ల ప్రారంభించ లేదు? తదితర వివరాలను అడిగారు. జాప్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. అవసరమైతే సీఎంవో అధికారుల సహకారం తీసుకుని ముందుకెళ్లండని సూచించారు. నాడు–నేడు కింద ప్రతి స్కూలు రూపు రేఖలు సర్వాంగ సుందరంగా మారాలని, విద్యార్థులు స్కూలు బిల్డింగ్‌ చూడగానే ఆ స్కూలుకు వెళ్లాలనే విధంగా అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కాంపౌండ్‌ వాల్‌ నుంచి స్కూల్‌ బిల్డింగ్‌ వరకు వాడే మెటీరియల్‌ మరింత నాణ్యత, ఆకర్షణీయంగా ఉండాలన్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా గోడలపై డ్రాయింగ్స్‌ వేయించాలని సూచించారు. నాడు–నేడు విషయంలో అధికారులు మరింత చొరవ తీసుకుని పనిచేయాలని చెప్పారు. వచ్చే సమీక్షా సమావేశానికల్లా పనుల్లో పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు.

నియోజకవర్గానికొక ‘విజేత’ తరహా స్కూల్‌
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో మానసిక వికలాంగుల కోసం వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ప్రత్యేకంగా నడుపుతున్న ‘విజేత’ స్కూల్‌ గురించి అధికారులు ప్రస్తావించారు. ఈ స్కూలు మంచి ఫలితాలు సాధిస్తోందని వివరించారు. మానసిక వికలాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాల ఒకటి ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. నాడు–నేడు పనుల్లో భాగంగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్‌ చిన వీరభద్రుడు, ఇంగ్లిష్‌ మీడియం స్పెషలాఫీసర్‌ వెట్రిసెల్వి, ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ఎండీఎం డైరెక్టర్‌ శ్రీధర్, అడిషనల్‌ డైరెక్టర్‌ కె.రవీందర్‌నాథరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు