వేతన జీవులకు అండగా... 

9 Jun, 2019 12:12 IST|Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: సచివాలయంలో అడుగుపెట్టిన తొలి రోజునే.. ఉద్యోగులకు అండగా ఉంటానని నూతన ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడంతో ఎన్జీవోలు ఉబ్బితబ్బి  బ్బవుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో లాంఛనంగా ప్రవేశించారు. కీలకమైన మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడులతోపాటు సంఘ ప్ర తినిధులు ముఖ్యమంత్రిని కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి జగన్‌ చేసిన ప్రసంగం వారిలో ఉత్సాహం నింపింది. ఆదివారం జరగనున్న కేబినెట్‌ తొలి భేటీలో 27 శాతం మధ్యంతర భృతి, సీపీఎస్‌ రద్దులపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న 27 శాతం ఐఆర్‌పై నిర్ణయం తీసుకుంటానని చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. సచివాలయంలో అడుగిడిన తొలిరోజే ఈ ప్రకటన చేయడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సీపీఎస్‌ రద్దు అంశంపై కూడా కేబినెట్‌ భేటీలో నిర్ణయం వెలువరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో ఆయా వర్గాల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్హతల ఆధారంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను దశలవారీగా రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల పెంపుపై కూడా సీఎం సానుకూలత వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు.  

ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా..
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఇందుకు ఆయన ప్రకటిం చిన వరాలే నిదర్శనం. ఉద్యోగి సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనేది నిజం. ఉద్యోగులుగా సుపరిపాలన సాగించేందుకు మావంతు కృషి చేస్తాం. – చల్లా శ్రీనివాసరావు, సంఘ జిల్లా కార్యదర్శి  

పరిపూర్ణ సహకారం
ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా తీసుకువెళ్లేందుకు ఉద్యోగులుగా తమవంతు బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం అన్నారు. ఉద్యోగి సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఆశావర్కర్ల జీతాల పెంపుపై నిర్ణయం వెలువరించడంతోపాటు తొలి సంతకం చేశారని, ఉద్యోగికి లబ్ది చేకూర్చే మరికొన్ని కీలక నిర్ణయాలు వెలువరించిన తీరు ప్రశంశనీయమన్నారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌పై, సీపీఎస్‌ రద్దుపై కేబినెట్‌ తొలి భేటీలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం ఆనందదాయకమన్నారు.  – హనుమంతు సాయిరాం

విశ్వసనీయతకు సంకేతం
ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్‌ రద్దుపై కేబినెట్‌లో చర్చిస్తామని ప్రకటించడం సీఎం జగన్‌ విశ్వసనీయతకు నిదర్శనం. సీపీఎస్‌ రద్దుకు గత ఐదేళ్లుగా ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నాం. అప్పటి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేసింది. –బడగల పూర్ణచంద్రరావు, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కౌన్సిలర్‌

మరిన్ని వార్తలు