వైఎస్సార్‌ యాప్‌తో ఆర్‌బీకే సేవల పర్యవేక్షణ

27 Jun, 2020 04:12 IST|Sakshi

ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సిబ్బంది పనితీరును రియల్‌ టైమ్‌లో తెలుసుకునే అవకాశం

క్షేత్ర స్థాయి కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సమాచారం

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ‘వైఎస్సార్‌ యాప్‌’ను శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా రైతులకు అందే సేవలు, సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫీడ్‌ బ్యాక్, ఆర్‌బీకేల్లోని పరికరాల నిర్వహణ, క్షేత్ర స్థాయిలో రైతుల అవసరాలు, మెరుగైన సేవలకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను రియల్‌ టైంలో ఉన్నత స్థాయి వరకు తెలుసుకునే అవకాశం వుంటుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

యాప్‌ ద్వారా రైతులకు మెరుగైన సేవలు
► రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ప్రభుత్వపరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.
► రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం, పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం ఉంటుంది. కొత్తగా ప్రజల కోసం రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా రియల్‌ టైంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడింది. 
► ఈ–క్రాప్‌ కింద నమోదు చేసిన పంటల వివరాలు, పొలం బడి కార్యక్రమాలు, సీసీ (క్రాప్‌ కటింగ్‌) ఎక్స్‌పరిమెంట్స్, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాల సందర్శన, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణ, పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్ధం చేయడం, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్‌బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలను అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా