అడవి బాట... బాక్సాఫీస్‌ వేట

18 Nov, 2023 02:21 IST|Sakshi

బాక్సాఫీస్‌ వసూళ్ల వేట కోసం తెలుగు హీరోలు కొందరు అడవి బాట పట్టారు. అడవి నేపథ్యంతో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ అడవి కథలపై కథనం.  

అడవిలో ఈగల్‌ 
‘ఎక్కడుంటాడు? అని రవితేజను ఉద్దేశిస్తూ అవసరాల శ్రీనివాస్‌ను అనుపమా పరమేశ్వరన్‌ అడగ్గానే అడవిలో ఉంటాడు అని సమాధానం చెబుతారు. ఈ సంభాషణ ఇటీవల విడుదలైన ‘ఈగల్‌’ సినిమా టీజర్‌లోనిది. రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కథ రీత్యా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయని టీజర్‌ స్పష్టం చేస్తోంది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. 

ఆఫ్రికన్‌ అడ్వెంచర్‌ 
ఆఫ్రికన్‌ అడవుల్లో వేటకు సిద్ధమౌతున్నారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రచయిత–దర్శకుడు కె. విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాగుతుందని, సహజమైన లొకేషన్స్‌లోనే చిత్రీకరించేలా రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని, విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు స్క్రిప్ట్‌కు మరింత పదును పెడుతున్నారని తెలిసింది. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభించడానికి ప్లాన్‌ చేస్తున్నారట. కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. 

అడవుల్లో దేవర 
‘జనతా గ్యారేజ్‌’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేశంలో విస్మరణకు గురైన తీర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుంది. అయితే కథ రీత్యా ‘దేవర’లో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ సీన్స్‌ ఉన్నాయని, ఈ సన్నివేశాల చిత్రీకరణ అడవుల్లో జరుగుతుందని, ఇవి ‘దేవర పార్ట్‌ 2’లో ఉంటాయనే టాక్‌ వినిపిస్తోంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. కల్యాణ్‌ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ‘దేవర’ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. 

పుష్పరాజ్‌ రూల్‌ 
ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ అల్లుకున్న ఊహాత్మక కథ ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ ఇప్పటికే విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’ కోసం ప్రస్తుతం వర్క్‌ చేస్తున్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌.

ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ల మాదిరిగానే ‘పుష్ప: ది రూల్‌’లోనూ ప్రధాన సన్నివేశాలు అడవుల నేపథ్యంలోనే సాగుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది. 

న్యూజిల్యాండ్‌లో కన్నప్ప 
శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ చేస్తుండగా మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ న్యూజిల్యాండ్‌లో జరుగుతుంది.ప్రస్తుతం అక్కడి లొకేషన్స్‌లోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది.

కథ రీత్యా ‘కన్నప్ప’ సినిమాలోని చాలా సన్నివేశాలు అడవి నేపథ్యంలోనే ఉంటాయి. అవా ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
ఇలా అడవి నేపథ్యంలో సాగే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. 

మరిన్ని వార్తలు