ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యం

30 Apr, 2020 03:38 IST|Sakshi

వ్యవసాయ ఉత్పత్తులు, ధరలు,మార్కెటింగ్‌పై సమీక్షలో సీఎం 

గతంలో కొనుగోలు చేయని మొక్కజొన్ననూ సేకరిస్తున్నాం 

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి 

గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులను వెంటనే ఆదుకోవాలి 

గుజరాత్‌ నుంచి వచ్చే మత్స్యకారులకు రూ.2 వేలు

సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్‌–19 విపత్తు నేపథ్యంలో మార్కెట్‌ లేకపోయినప్పటికీ వినూత్న ఆలోచనలు, చర్యలతో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఎక్కువగానే కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలోని ముఖ్యాంశాలు.. 

మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితి 
► ఏ పంట అయినా రైతుల వద్ద నుంచి ఎక్కువే కొనుగోలు చేశాం. గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కొనుగోలు చేయని మొక్కజొన్నను కూడా సేకరిస్తున్నాం. 
► ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మార్కెట్లో ధరల స్థిరీకరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రాపింగ్, ఫాంగేట్, టోకెన్ల పద్ధతి ద్వారా కొనుగోలు సాగుతోంది.  అరటి, టమాటా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. చీనీ పంటకు ధర వచ్చేలా చూడాలి. గాలివాన కారణంగా పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో వెంటనే ఎన్యుమరేషన్‌ చేసి రైతులను ఆదుకోవాలి. 
► ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వాటి ద్వారా కూరగాయలను పంపిస్తున్నామని, మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. రెడ్‌ జోన్లకు చేరువగా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగాలని సీఎం సూచించారు. 
► గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను తిరిగి స్వస్థలాలకు తీసుకు వస్తున్న అంశంపై సీఎం ఆరా తీశారు. రవాణా ఖర్చులు, భోజనం, తదితర ఖర్చులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు తెలిపారు. 4,065 మందికిపైగా స్వస్థలాలకు బయల్దేరారని చెప్పారు.  
► మత్స్యకారులు తిరిగి వచ్చిన తర్వాత వారికి రూ.2 వేల చొప్పున ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  

మరిన్ని వార్తలు