ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి: సీఎం జగన్‌

10 Apr, 2020 17:15 IST|Sakshi

కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ సహా, కరోనా వైరస్‌ విస్తరణ ఉన్న ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కేసుల పరిస్థితి, వ్యాధి నియంత్రణ చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కరోనా నియంత్రణలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాకు అదనంగా ఐదు ఆసుపత్రుల చొప్పున గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. క్రిటికల్‌ కేర్‌ కోసం నాలుగు ప్రధాన ఆసుపత్రులు, ప్రతి జిల్లాకు ఒక ఆసుపత్రి సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లాలకు అదనంగా ఐదు ఆసుప్రతుల చొప్పున సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు

క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డులో సదుపాయాలపై సీఎం సమీక్ష..
క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డుల్లో సదుపాయాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. ఐసోలేషన్‌లో ఉంచే వారికి మంచి సదుపాయాలు ఉన్న గదులు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనిపై అధికారులు దృష్టిసారించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడోసారి జరుగుతున్న కుటుంబ సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. జలుబు, గొంతునొప్పి, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో ఉన్నవారి అందరికీ పరీక్షలు చేయించాలని మరోసారి సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులు,మార్కెటింగ్‌పై సీఎం సమీక్ష
వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా కడప, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని,  నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పిడుగుపాటుకు, బోటు ప్రమాదంలో మరణించిన వారికి 24 గంటల్లోగా ఎక్స్‌గ్రేషియా అందించాలని సంబంధిత  కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలి..
వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రవాణాను పెంచడానికి సంబంధిత అసోసియేషన్లతో మాట్లాడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. మొక్కజొన్న, శెనగ, కందులు, జొన్నలు, పసుపు లాంటి పంటలకు మార్కెటింగ్, ధరల పరంగా రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం సూచించారు. పౌల్ట్రీ సెక్టార్‌తో మాట్లాడి మొక్కజొన్న కొనుగోలు చేసేలా చూడాలన్నారు. తగు చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు.

అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ యాప్ గురించి సీఎంకు అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు తప్పనిసరిగా తమతమ గ్రామాల్లోని పంటలు, వాటి ధరలపై ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా తెలియజేసేలా చూడాలని సీఎం సూచించారు. యాప్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా చర్యలు వెను వెంటనే తీసుకునేలా వ్యవస్థ సన్నద్ధతతో ఉండాలన్నారు. రొయ్యలు, చేపల ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు