కొంపముంచిన మామూళ్ల పంచాయితీ

13 Jan, 2015 01:55 IST|Sakshi

కమిషనర్ పేరుతో కలెక్షన్లు
వెలుగు చూస్తున్న మరిన్ని నిజాలు
కలకలం రేపిన ‘సాక్షి’ కథనం

 
విజయవాడ సెంట్రల్ : అక్రమాలపై ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కుల్లో కలకలం మొదలైంది. విజిలెన్స్ విచారణ లోతుగా సాగితే తమ కొంప కొల్లేరవుతుందని పలువురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు బెంబేలెత్తుతున్నారు. ‘టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి ప్రకంపనలు’ శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ సాగింది. టౌన్‌ప్లానింగ్ అక్రమాలపై వచ్చే ఆరోపణలపై ఇప్పటి వరకు శాఖాపరమైన దర్యాప్తు సాగింది కాబట్టి ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ వచ్చారు. నేరుగా ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో మూల్యం భారీగా చెల్లించుకోక తప్పదనే భయం అక్రమార్కులను వెంటాడుతోంది.
 
మూమూళ్ల పంపకాల్లో తేడాల వల్లే..

మామూళ్ల పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే విజిలెన్స్‌ను ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ల (టీపీఎస్) మధ్య కొద్ది రోజులుగా కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు సమాచారం. వన్‌టౌన్‌లో అక్రమ కట్టడాలకు సంబంధించి ఒక టీపీఎస్ భారీగా మామూళ్లు వసూలు చేసినట్లు వినికిడి. తన పరిధి కాని దాంట్లో అతను తలదూర్చి డబ్బులు దండుకోవడమే వివాదానికి కారణంగా తెలుస్తోంది. సిటీ ప్లానర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే ఈ టీపీఎస్ ఓవర్ యాక్షన్ ఎక్కువవడంపై పలువురు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రమంత్రి బావమరిది పటమట ప్రాంతంలో ఇల్లు కట్టారు. మార్ట్‌గేజ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరారు. నిబంధనల పేరుతో అతని వద్ద టీపీఎస్ చేయిచాచడంతో ‘మా బావ ఎవరో తెలుసా అంటూ’ మంత్రి బావమరిది వార్నింగ్ ఇచ్చారు. దీంతో కంగుతిన్న టీపీఎస్ మార్ట్‌గేజ్ రిలీజ్ చేయాల్సిందిగా బిల్డింగ్ ఇన్‌పెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

కమిషనర్ పేరుతో కలెక్షన్

కమిషనర్ పేరుతో టౌన్ ప్లానింగ్‌లో కలెక్షన్ చేస్తున్నట్లు బలమైన విమర్శలు ఉన్నాయి. ఇటీవల బదిలీ అయిన సి.హరికిరణ్ తన హయాంలో టౌన్‌ప్లానింగ్ నుంచి వచ్చే కొన్ని ఫైళ్లపై స్పీక్, డిస్కస్ అని రాసేవారని తెలుస్తోంది. దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్న ఇద్దరు అధికారులు గృహ నిర్మాణదారుల నుంచి గట్టిగా ఆమ్యామ్యాలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్బీపేట గ్రీన్‌ల్యాండ్స్ సమీపంలో ఒక భవనం మార్ట్‌గేజ్ రిలీజ్‌కు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఫైల్‌పై కమిషనర్ డిస్కస్ అని రాయడంతో ‘కమిషనర్ మీ బిల్డింగ్ విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ఆక్యుపెన్సీ రావడం కష్టం’ అంటూ ఆ భవన యజ మానిని బెదిరించి మూడు లక్షల రూపాయలు గుంజినట్లు తెలుస్తోంది. అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ  నిష్పక్షపాతంగా జరిగితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు