అష్ట దిగ్బంధంలో నరసరావుపేట

29 Apr, 2020 10:08 IST|Sakshi

 నేడు, రేపు నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ 

 ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలతో  పర్యవేక్షణ 

 డ్రోన్‌లతో కొనసాగుతున్న  సర్వేలెన్స్‌ 

 జిల్లాలో కొత్తగా 16 కేసులు 

 కాంటాక్ట్‌ల గుర్తింపు, క్వారంటైన్‌కు తరలింపు వేగవంతం 

సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు, నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్‌ కేసులు బయటపడుతున్నాయి.

ఇప్పటి వరకు జిల్లాలో 253 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వాటిలో 109 కేసులు రూరల్‌ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. దీంతో నరసరావుపేటలో 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు.  పట్టణం చుట్టూ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరిస్తున్నారు.
 
ప్రత్యేక బృందాలు 
పోలీసులు పేటలో నమోదైన పాజిటివ్‌ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 920 ప్రైమర్, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. ఇంకా 200 మందికిపైగా గుర్తించి క్వారంటైన్‌ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో కాంటాక్ట్‌ల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు ప్రత్యేక బృందాల్లో పని చేస్తున్నారు.  

‘డ్రోన్‌’ కన్నుతో 
నరసరావుపేటలోని వరవకట్టు ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. డ్రోన్‌లతో ఎప్పటికప్పుడు లాక్‌ డౌన్‌ అమలును పర్యవేక్షిస్తున్నారు. సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్, ఏఎన్‌ఎస్‌ పోలీసులు పేటలో 24/7 గస్తీ కాస్తున్నారు.  కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో భద్రత కోసం మూడు ప్లటూన్ల ప్రత్యేక బృందాలు, ఎనిమిది మంది సీఐలు, 14మంది ఎస్‌ఐలు, 10 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 50 మంది కానిస్టేబుళ్లను నరసరావుపేటకు అదనంగా ఇటీవల కేటాయించారు. 

ఫలిస్తున్న ప్రణాళికలు  
రెడ్‌జోన్‌ ప్రాంతాల నుంచి వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించ కుండా గ్రీన్‌జోన్‌లను కాపాడుకునే విధంగా యంత్రాంగం ప్రణాళికలు రచించింది.  ఇందులో భాగంగానే రెడ్‌జోన్‌ ప్రాంతంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడ ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు.  కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులు క్వారంటైన్‌లో ఉండటం వల్ల యంత్రాంగం కొంత మేర ఊపిరి పీల్చుకుంటుంది. 

బయటకు రావొద్దు..దది
‘కరోనాను నిర్మూలించడంలో ప్రజలు తమవంతు సహకారం అందించాలి. ప్రధానంగా రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేస్తే వారి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

ప్రజలు సహకరించాలి
నరసరావుపేటలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. వైరస్‌ మూలాలు ఇక్కడి నుంచి రూరల్‌ జిల్లా మొత్తం వ్యాపిస్తున్నాయి. దీంతో పేటను అష్టదిగ్బంధం చేశాం. లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్కరు పోలీస్‌ ఆంక్షలకు లోబడి నడుచుకోవాలని రూరల్‌ ఎస్పీ, విజయరావు స్పష్టం చేశారు.
– విజయరావు, రూరల్‌ ఎస్పీ

మరిన్ని వార్తలు