కుట్రకు బ్రేక్

15 Jul, 2015 02:57 IST|Sakshi
కుట్రకు బ్రేక్

సాక్షి ప్రతినిధి, కడప : జిల్లా పరిషత్ పాలక వర్గం తీసుకున్న నిర్ణయాలపై విచారణకు హైకోర్టు బ్రేకులు వేసింది. వివరాల్లోకి వెళితే.. 13వ ఫైనాన్స్ నిధుల వెచ్చింపులో ఏకపక్షంగా అడ్డగోలుగా వ్యవహరించారని అధికార టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న తక్షణమే పంచాయితీరాజ్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. నిబంధనల మేరకు పాలకవర్గం పనిచేస్తున్నా అడ్డగోలుగా విచారణకు అదేశించారని, విచారణకు కలెక్టర్ కెవి రమణ అర్హుడు కాదంటూ జెడ్పీ చైర్మన్ గూడూరు రవి హైకోర్టును ఆశ్రయించారు.

ఆ మేరకు హైకోర్టు మంగళవారం స్టేటస్‌కో ఆర్డర్ జారీ చేసింది. రాష్ట్రంలో విపక్షాన్ని అస్థిత్వ పర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ చేతిలో జెడ్పీ పాలకవర్గ పగ్గాలు ఉన్నాయనే దుగ్ధతో టీడీపీ నేతలు కుట్ర పూరిత రాజకీయాలకు తెరలేపారు. ఇందులో భాగంగా జెడ్పీ పాలక మండలి అక్రమంగా నిధులు వెచ్చించిందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ కేవీ రమణను పంచాయితీరాజ్ కమిషనర్ విచారణాధికారిగా నియమించారు.    దళితుడినైన తన పట్ల వివక్ష చూపుతూ, అవమానాలకు గురి చేస్తున్న కలెక్టర్‌ను విచారణాధికారిగా ఎలా నియమిస్తారని జెడ్పీ చైర్మన్ రవి హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకే తాము 13వ ఫైనాన్స్ నిధులను వెచ్చించామని తెలిపారు. మంగళవారం వాదనలు విన్న హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది.

 వేధింపుల్లో భాగంగానే..
 జిల్లా పరిషత్‌లో 39 మంది సభ్యులు వైఎస్సార్‌సీపీ చెందిన వారున్నారు. కేవలం 11 మంది మాత్రమే టీడీపీ సభ్యులు. వారిలో ఒకరు చనిపోయారు. నలుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులు అధికార పార్టీతో జట్టు కట్టారు. ఎమ్మెల్యే స్థానాలు దక్కలేదన్న కసితో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతోంది. తాగునీరు, ఇతర అభిృద్ధి పనులకు జిల్లా పరిషత్ నిధులే పెద్ద దిక్కుగా మారాయి. ఈ నేపథ్యంలో 13వ ఫైనాన్సు నిధులు రూ.10.47 కోట్లు జిల్లాకు దక్కాయి. జిల్లాలో పలు అవసరమైన పనుల కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదనలు ఇచ్చారు.

ఆ మేరకు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి.. అవసరాన్ని బట్టి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ సభ్యులు జెడ్పీ చైర్మన్‌కు ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వనందున వారికి నిధుల కేటాయింపు జరగలేదు. పలు పనులకు నిధులు కేటాయించాలని వారు జెడ్పీ సిఈఓను కోరారు. జిల్లా పరిషత్‌కు చైర్మనే కీలకం కావడం, ఆయనకు వారి నుంచి ప్రతిపాదనలు రాకపోవడం, వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీటీసీ సభ్యుల నుంచి అత్యవసర పనులకు ప్రతిపాదనలు ఉండడంతో నిబంధనల మేరకు నిధులు మంజూరు చేశారని పంచాయితీరాజ్ వర్గాలు వివరిస్తున్నాయి.

టీడీపీ సభ్యులకు నిధులు మంజూరు కాలేదనే కారణంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి పంచాయితీ రాజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం వ్యవహారంలో ‘లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు’ బూచిగా చూపెట్టి జెడ్పీ చైర్మన్ గూడూరు రవిపై సస్పెన్షన్ వేటు వేయడానికి అధికార పార్టీ వ్యూహం రూపొందించుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగా వారి కుట్రకు బ్రేకులు పడ్డాయి. కాగా, జెడ్పీలో ఇటీవల చేసిన తొమ్మిది తీర్మానాలను కలెక్టర్ రద్దు చేశారు. మెజార్టీ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా కలెక్టర్ నిర్ణయంపై సైతం జెడ్పీ చైర్మన్ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తె లిసింది. కలెక్టర్ వ్యక్తిగతంగా తనను అవమాన పరుస్తున్నారని, దళితుడనే వివక్ష చూపుతున్నారని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని కూడా ఆయన హైకోర్టు ృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు