‘అట్లూరి’ మామూలోడు కాదు!

7 Dec, 2023 01:12 IST|Sakshi

చంద్రబాబు, లోకేశ్‌ వ్యవహారాలు చూసేవాడని ప్రచారం 

టీడీపీ నేతలతోనూ సన్నిహిత సంబంధాలు 

పలు చీటింగ్‌ కేసుల్లో నిందితుడిగా సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు 

ఆర్బిట్రేషన్‌ పేరుతో విశాఖకు చెందిన సంస్థకు భారీ టోకరా 

అరెస్టు విషయం తెలియడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో (సీసీఎస్‌) నమోదైన ఫాస్ట్‌ మూవింగ్‌ కన్‌జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) కేసులో అరెస్టు అయిన తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణరావుకు తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్టు వెలుగులోకి వచ్చింది. సదరు నారాయణరావు అయితే ఏకంగా తనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పుకునే వాడని తెలిసింది.

వందల మంది నుంచి డిపాజిట్ల రూపంలో రూ.540 కోట్లు వసూలు చేసి నిలువునా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్న ఈ స్కామ్‌లో గత వారం అరెస్టు అయిన నారాయణరావుని సీసీఎస్‌ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారంతో కస్టడీ గడువు పూర్తవడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

సినీ రంగంలోకి ప్రవేశించాకే మోసగాడిగా... 
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నారాయణరావు అప్‌లైడ్‌ మాథమేటిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశాడు. బతుకుతెరువు కోసం హైదరాబాద్‌ వచ్చిన అతను కొన్నాళ్ళు ఓ ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాడు. బంజారాహిల్స్‌లోని ఆదిత్య హిల్‌టాప్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తూ సినీ రంగంపై ఉన్న మోజుతో నిర్మాతగా మారాడు. 2018లో ‘నీది నాది ఒకే కథ’, 2022లో ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండు’చిత్రాలు తీశాడు. దీనికి అవసరమైన డబ్బు కోసమే మోసాలు చేయడం మొదలెట్టాడు. శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు 3 ఎకరాల భూమి ఉంది.

ఖాళీగా ఉన్న ఈ భూమిపై కన్నేసిన నారాయణ రావు దాన్ని ఎవరికైనా అంటగట్టి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. ఎన్‌.రామాచార్యులు అనే వ్యక్తిని దీనికి యజమానిగా మార్చాడు. ఆ మేరకు నకిలీ పత్రాలు సృష్టించిన నారాయణరావు వాటి ఆధారంగా ఖైరతాబాద్‌లో ఎస్‌ఎంహెచ్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను నిర్వహించే బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి సయ్యద్‌ మహమూద్‌ హుస్సేన్‌ను సంప్రదించి ఆయన నుంచి రూ.1,65,12,500 కాజేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. 

’బాబు’ల వ్యవహారాలు చూసేవాడినంటూ.. 
నారాయణరావుకు తెలుగుదేశం నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మేరకు నేతలతో దిగిన ఫొటోలను చూపించే వాడు. ఇక చంద్రబాబు, లోకేశ్‌తో సైతం తాను దగ్గరగా మెలుగుతుంటానని ప్రచారం చేసుకునేవాడు. తరచుగా చంద్రబాబు, లోకేశ్‌లను కలుస్తుంటాననీ, వారికి సంబంధించిన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటానని చెప్పుకునే వాడని తెలిసింది. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమని తెలుస్తోంది. 

న్యాయ విభాగంలో పరిచయాలు ఉన్నాయంటూ... 
గడిచిన కొన్నాళ్ళుగా న్యాయ విభాగంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయంటూ చెప్పి నారాయణ రావు అనేక మంది నుంచి డబ్బు గుంజాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంబాబు, కృష్ణంరాజుకు ఇలానే చెప్పి వారి నుంచి నగదు, రూ.కోటి విలువైన బంగారం తీసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన ఓ కంపెనీకి, కర్ణాటకకు చెందిన మరో కంపెనీకి మధ్య వివాదం నడుస్తోంది.

విశాఖ కంపెనీ యజమానిని సంప్రదించిన నారాయణరావు తనకు న్యాయ విభాగంలో పలుకుబడి ఉందని నమ్మబలికాడు. ఆర్బిట్రేషన్‌ విధానంలో సమస్య పరిష్కరించడంతో పాటు నష్టం నివారిస్తానంటూ నమ్మించాడు. ఇలా వారి నుంచి భారీ మొత్తం తీసుకుని మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న విశాఖ కంపెనీ సంబం«దీకులు బయటకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. 


ఆ డబ్బుతోనే మరో సినిమా..  
ఎఫ్‌ఎంసీజీ కేసులో నారాయణరావును అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణతో పాటు రెండు రోజుల పోలీసు కస్టడీ విచారణలో కీలక విషయాలు సేకరించారు. ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ద్వారా రాంబాబుకు పరిచయమైన నారాయణరావు తన పలుకుబడి వినియోగించి కేసు లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు.

ఇందుకు రూ.2 కోట్లు ఇవ్వాలంటూ అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. కానీ ఆ కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చి ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో దాఖలు చేయించే ప్రయత్నం చేశాడు.

ఈలోగా బంగారు ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఈ డబ్బుతోనే మరో చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బుధవారం నారాయణరావుకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఇతడి వ్యవహారాలను మ రింత లోతుగా ఆరా తీయాలని నిర్ణయించారు.

>
మరిన్ని వార్తలు