జగన్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలతో కాన్వాయ్‌

25 May, 2019 03:22 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ కోసం ఏర్పాటు చేసిన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు

ఆరు కొత్త వాహనాలను సమకూర్చిన ప్రభుత్వం 

జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రభుత్వం కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. తాత్కాలిక కాన్వాయ్‌గా ఏపీ18పీ3418 నంబర్‌తో ఆరు కొత్త వాహనాలను సమకూర్చారు. బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలతో కూడిన నూతన వాహనశ్రేణి శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతంలో పోలీసులు భద్రతాపరమైన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఇప్పటికే పెంచిన సంగతి తెలిసిందే. 

జగన్‌కు ‘జెడ్‌’ కేటగిరీ భద్రత
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ‘జెడ్‌’ కేటగిరీ భద్రత కల్పించినట్టు రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ చెప్పారు. తాడేపల్లిలోని జగన్‌ నివాసం వద్ద భద్రతాపరమైన అంశాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. జగన్‌ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. శనివారం తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆరు ప్లాటూన్ల బలగాలను ఏర్పాటు చేశామని రవిశంకర్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు