ప్రిస్టేజ్ పోయింది!

22 Jul, 2015 09:52 IST|Sakshi
  • ఐసీడీఎస్‌లో కుక్కర్ల కుంభకోణం
  •  రూ.74 లక్షలతో కుక్కర్ల కొనుగోలుకు టెండర్లు
  •  సరఫరా చేయకముందే కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపు
  •  ఎనిమిది నెలలకు ప్రిస్టేజ్ స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా
  •  లోపాయికారి ఒప్పందంతో నోరు మెదపని అధికారులు
  •  సాక్షి ప్రతినిధి, కడప :
     వక్ర మార్గానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఐసీడీఎస్ కార్యాలయం తయారైంది. పిల్లల పౌష్టికాహారం మొదలు ప్రతి సందర్భంలోనూ అక్రమ ఆదాయమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఓ వైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఆ శాఖ పనితీరులో మార్పు కనిపించడం లేదు. తాజాగా కుక్కర్ల కొనుగోల్‌మాల్ వ్యవహారం బహిర్గతమైంది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించిన ఎనిమిది నెలల అనంతరం లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఐసీడీఎస్ శాఖ అంగన్‌వాడీ కేంద్రాలకు కుక్కర్లు సరఫరా చేయదలిచింది. ఆ మేరకు 7.5 లీటర్ల కెపాసిటి గల 3621 కుక్కర్లు, 5 లీటర్లు కెపాసిటిగల 2861 కుక్కర్ల కోసం టెండర్లు ఆహ్వానించారు. 7.5 లీటర్ల కుక్కర్ రూ.1320 చొప్పున, 5 లీటర్ల కుక్కర్ రూ.940 చొప్పున సరఫరా చేసేందుకు ఎంఅండ్‌ఎస్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ టెండర్లు దక్కించుకుంది. ఈ ప్రక్రియ గత ఏడాది ఫిబ్రవరి 14న  ముగిసింది. టెండర్లు దక్కించుకున్న నెలలోపు కాం ట్రాక్టర్ బిల్లు పెట్టుకున్నాడు. మార్చి 10న బిల్లు పెట్టుకోగా మార్చి 12న రూ.74.69 లక్షలు ఐసీడిఎస్ యంత్రాంగం కాం ట్రాక్టర్‌కు చెల్లించి ంది. వాస్తవానికి కుక్కర్లు సరఫరా చేసిన అనంతరం బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ ఇచ్చిన కాసులకు కక్కుర్తిపడిన యంత్రాంగం ముందుస్తుగా బిల్లు చెల్లించి స్వామి భక్తి ప్రదర్శించినట్లు సమాచారం. అనంతరం ఎనిమిది నెలల పాటు కుక్కర్లు సరఫరా చేయకపోయినా యంత్రాంగం ‘నిమ్మకు నీరెత్తినట్లు’గా ఉండిపోయారు. నవంబర్ 12న కుక్కర్లు సరఫరా చేశారు. లోపాయి కారి ఒప్పందం వల్లే అధికారులు ఇంత ఆలస్యమైనా నోరు మెదపనట్లు సమాచారం.
     
     ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ స్థానంలో లోకల్‌మేడ్
      నిబంధనల మేరకు ఎంఅండ్‌ఎస్ ఎంటర్ ప్రైజెస్ ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్లు సరఫరా చేయాల్సి ఉంది. అయితే లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, కమలాపురం, ప్రొద్దుటూరు, పులివెందుల, సిద్ధవటం సీడీపీఓ ప్రాజెక్టు పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మండల కేంద్రాల పరిధిలో నిబంధన మేరకు కంపెనీ కుక్కర్లు సరఫరా చేసి, గ్రామాల పరిధిలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేసినట్లు సమాచారం. దాదాపు 3500 పైగా లోకల్‌మేడ్ కుక్కర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సుమారు రూ.20 లక్షలు పైగా అక్రమంగా కాంట్రాక్టర్ సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు ప్రత్యక్షంగా ఐసీడీఎస్ యంత్రాంగం సహకారం స్పష్టంగా కన్పిస్తోంది.
     
     వాస్తవమే.. విచారిస్తున్నాం : ఐసీడీఎస్ పీడీ రాఘవరావు
      అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రిస్టేజ్ ఫ్రెషర్ కుక్కర్ల స్థానంలో లోకల్ మేడ్ కుక్కర్లు సరఫరా చేశారని కొంత మంది సీడీపీఓలు నా దృష్టికి తెచ్చారు. ఆ మేరకు విచారణ చేపడుతున్నాం. బిల్లులు ముందుస్తుగా ఎందుకు చెల్లించారనే విషయమై కూడా విచారణ సాగుతోంది. లోకల్ మేడ్ కుక్కర్లు ఉన్నట్లు గుర్తించాం. శాఖపరంగా విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.

మరిన్ని వార్తలు