కరోనా: అప్రమత్తతే రక్ష

9 Apr, 2020 08:45 IST|Sakshi
ఇలాగైతే ఎలా.. విజయవాడలో రెడ్‌ జోన్‌ ప్రకటించిన ప్రాంతంలో యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న జనాలు

ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ 

ఇంటి వద్దకే నిత్యావసరాలు  

కొన్ని చోట్ల యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు

కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు

సాక్షి, కృష్ణా: కరోనా వైరస్‌తో ఎంతటి ముంపు పొంచి ఉందో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళకర పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి విపత్కర సమయంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌కు మించిన మంత్రం లేదు. అదే సమయంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాలి. కానీ జిల్లా పరిధిలోని అధిక శాతం ప్రాంతాల్లో వాతావరణం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఇచ్చిన వెసులుబాటును పౌరులు అధిక శాతం దురి్వనియోగం చేయడం కరోనా విస్తరణకు మార్గం సుగమం చేయడమే అవుతుంది.

ఈ నేపథ్యంలో కనీస జాగ్రత్తలు తీసుకుని, స్వీయ నియంత్రణ పాటించి అప్రమత్తంగా ఉండటమే శ్రీరామరక్ష అని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో విజయవాడ నగరంలోని 6 ప్రాంతాలు, జిల్లాలోని మరో ఐదు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి నేటి నుంచి అక్కడ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా గురువారం నుంచి నిత్యావసరాల కొనుగోళ్ల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి 9 గంటలకు పరిమితం చేశారు. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

పనిలేకున్నా రోడ్లపైకి పౌరులు..  
చేతిలో మందుల చీటి.. వాహనాలకు అత్యవసరం పేరిట స్టిక్కర్లు అంటించుకుని జిల్లాలో యథేచ్ఛగా జనం తిరుగుతున్నారు. ముఖ్యంగా పట్టణ, నగరాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలో పోరంకిలో ఉంటున్న ఓ వ్యక్తిని బెంజిసర్కిల్‌ వద్ద పోలీసులు నిలిపి ప్రశ్నించగా.. నిత్యావసరాల కోసం డీమార్ట్‌కు వెళ్తున్నాని చెప్పాడు. లాక్‌డౌన్‌ సమయంలో మీ ఇంటి నుంచి 3 కిలోమీటర్లు దాటి రాకూడదని తెలియదా అని పోలీసులు చెబితే.. మా ప్రాంతంలో అన్ని నరుకులు ఒకేచోట లభించడం లేదని అందుకే అక్కడి వెళ్తున్నానే వింత సమాధానం వస్తోందని పోలీసులు చెబుతున్నారు.  

కాలనీలపై కన్ను..  
విజయవాడలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న కాలనీల్లోకి రాకపోకలు నియంత్రించేందుకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీలకు నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 25కు పెరగడంతో అక్కడ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.  

రెడ్‌జోన్లుగా 11 ప్రాంతాలు..  
పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రత్తమైంది. కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని కుమ్మరిపాలెం, ఓల్డ్‌ రాజరాజేశ్వరిపేట, రాణిగారితోట, ఖుదూస్‌నగర్, పాయకాపురం, కానూరు గ్రామంలోని సనత్‌నగర్‌లను, మచిలీపట్నంలోని చిలకలగూడ(ఏడు వార్డులు), జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గంలోని రాఘవాపురం, ముప్పాళ్ల గ్రామాలు, నూజివీడులను రెడ్‌జోన్లుగా జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. నేటి నుంచి ఈ ప్రాంతాలన్నింటిలోనూ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఎవ్వరూ ఇంటి గడప దాటి బయటకు రాకూడదు. ఇతరులు ఆ ప్రాంతాలకు వెళ్లకూడదు. అక్కడి ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, పాలు, గుడ్లు వంటి వాటిని ఇళ్ల వద్దకే తీసుకొచ్చి అందజేస్తారు. కూరగాయలు తదితరాల కోసం మొబైల్‌ వ్యాన్లను సమకూరుస్తున్నారు.

దశదిశలా కట్టడి ట్రాక్టర్‌ మౌంటెడ్‌ స్ప్రేయర్‌ను  ప్రారంభించిన మంత్రి వెలంపల్లి
భవానీపురం: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో ట్రాక్టర్‌ మౌంటెడ్‌ స్ప్రేయర్‌ సల్కాన్‌–600 మెషిన్‌ (పత్తి పొలాల్లో మందు చల్లటానికి వినియోగించే యంత్రం)ను బుధవారం దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సౌకర్యా లను కరనా కట్టడికి వినియోగిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ షాలిని, డాక్టర్‌ వెంకటరమణ, డాక్టర్‌ ఇక్బాల్‌ హుస్సేన్, వైఎస్సార్‌ సీపీ నాయకులు జి. నరేంద్ర, షేక్‌ హయాత్‌ షరీఫ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు