-

అతడు కరోనాను జయించాడు

4 Apr, 2020 08:49 IST|Sakshi
కరోనా నెగిటివ్‌ వచ్చిన యువకుడిని అభినందిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం అస్మి, ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి తదితరులు

లండన్‌ నుంచి రావడంతోనే కరోనా పాజిటివ్

హుటాహుటిన కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు 

13 రోజుల చికిత్సతో నెగిటివ్‌

అభినందించిన కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే  

కరోనా...ప్రపంచాన్నే వణికించేస్తోంది. ఓ వైపు పెరుగుతున్న అనుమానితులు .. మరో వైపు నిర్ధారణవుతున్న పాజిటివ్‌ కేసులు...ఈ నేపథ్యంలో ఓయువకుడు పదిహేను రోజుల కిందట నేరుగా లండన్‌ నుంచి రాజమహేంద్రవరానికి వచ్చి.. అనుమానంతో చికిత్స చేయించుకోగా పాజిటివ్‌గా తేలడంతో భయం లేకుండా పూర్తి స్థాయిలో చికిత్స చేయించుకున్నాడు. 13 రోజుల అనంతరం కరోనాను జయించి పలువురి 
అభినందనలు అందుకున్నాడు.

సాక్షి, కాకినాడ: చైనాలో ప్రబలి.. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ బారిన పడి జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసుగా నమోదయిన రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు కరోనాను జయించాడు. పాజిటివ్‌ నుంచి నెగిటివ్‌గా మారడంతో జిల్లా ప్రజల్లో ఆనందం వ్యక్తమయింది. ప్రభుత్వాలు, వైద్యులు సూచనలు పాటిస్తే భయపెడుతున్న కరోనాను జయించవచ్చునని ఈ యువకుడే నిలువెత్తు సాక్ష్యమని వైద్యులు చెప్పారు. లండన్‌ నుంచి నేరుగా విమానంలో హైదరాబాదు, అక్కడ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఈ యువకుడు తన డాబాపై ఉన్న పెంట్‌హౌస్‌కి వెళ్లి స్వీయ నిర్బంధం చేసుకున్నాడు. మరుసటి రోజున దగ్గు, రొంప అధికమవడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విషయం చెప్పాడు.

వెంటనే అక్కడ నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించి వైరాలజీ టెస్టులు చేయడంతో కరోనా వైరస్‌ నిర్ధారణయింది. వెంటనే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ప్రత్యేక వైద్యబృందం ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి వైద్య చికిత్సలు అందజేశారు. దీంతో 13 రోజుల అనంతరం పాజిటివ్‌గా ఉన్న వైరస్‌ నెగిటీవ్‌గా మారింది. రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన సంపూర్ణ ఆరోగ్యంగా ఆ యువకుడు ఉన్నాడని ప్రకటించడంతో కాకినాడ జీజీహెచ్‌ నుంచి శుక్రవారం డిశ్చార్జ్‌ చేసి అతని స్వగ్రామమైన రాజమహేంద్రవరానికి  108 అంబులెన్స్‌లో పంపించారు. 

కలెక్టర్, ఎస్పీలు అభినందనలు 
ఆసుపత్రి నుంచి డిశ్చార్స్‌ అయిన యువకుడిని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, ఎంపీ వంగా గీత, నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, ఆర్‌ఎంవో గిరిధర్, వైద్యబృదం అభినందించింది.  

ఢిల్లీ నుంచి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా 
జిల్లాలో నుంచి ఢిల్లీకి వెళ్లిన వారు 36 మంది ఉన్నారని, వీరిలో ఇద్దరు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారన్నాని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి తెలిపారు. వీరిలో 34 మంది జిల్లాకు చేరుకున్నట్లు తెలిపారు. వీరికి కరోనా పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ కేసులుగా గుర్తించి కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు.  వారి కుటుంబ సభ్యులైన 200 మంది నుంచి సాంపిల్స్‌ సేకరించినట్లు తెలిపారు.   

జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు 
ప్రజలందరూ ఇళ్లవద్దనే ఉండండి : కలెక్టర్‌ 
సాక్షి, కాకినాడ: జిల్లాలో శుక్రవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్, అతని తమ్ముడికి కరోనా పాజిటివ్‌గా తేలిందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. గత నెల 17న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో నిజాముద్దీన్‌ నుంచి రాజమహేంద్రవరం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో దిగిన 180 మంది మర్కజ్‌ యాత్రికుల్లో వీరూ ఉన్నారని, మిగిలిన వారు ఎక్కడున్నారో తెలియదని, ప్రజలంతా ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్‌ సూచించారు.

దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. శుక్రవారం నమోదైన ఈ రెండు కేసులతో జిల్లాలో మొత్తం 10 కరోనా పాజిటవ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి తొమ్మిదిగా ఉన్న కేసులలో, ఒకరు నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి అవడంతో మిగిలిన ఎనిమిది కేసులకు తాజా రెండు కేసులతో మొత్తం 10 కేసులు నమోదైనట్టు అధికారులు ధృవీకరించారు. 

మరిన్ని వార్తలు