కర్నూలు, నంద్యాలలోని రెడ్‌జోన్లపై ప్రత్యేక దృష్టి 

23 Apr, 2020 10:44 IST|Sakshi
మాట్లాడుతున్న అజయ్‌జైన్‌ 

కోవిడ్‌ –19 ప్రత్యేకాధికారి అజయ్‌జైన్‌  

సాక్షి, కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు, నంద్యాల అర్బన్‌ ప్రాంతాల్లోని రెడ్‌జోన్లలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరంగా అమలు చేయాలని కోవిడ్‌–19 ప్రత్యేకాధికారి అజయ్‌జైన్‌ నోడల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. నిత్యావసరాలు, అత్యవసరాలను వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్‌జోన్లలో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా చూడాలన్నారు. కేవలం మందుల కోసం అది కూడా ప్రిస్కిప్షన్‌ చూపిన తర్వాతే బయటకు అనుమతించాలన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కోవిడ్‌–19 నోడల్‌ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, ఆర్‌డీఓలతో సమీక్షించారు.

పాలు, కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకులు కావాల్సిన వారు ముందు రోజే వలంటీర్లకు డబ్బు ఇచ్చేలా, వలంటీర్లు వాటిని సమకూర్చే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఆహార ప్యాకెట్ల పంపిణీ వంటి కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించకపోవడం, ప్రజలు కూడా యథేచ్ఛగా ఇళ్ల నుంచి బయటకు వస్తుండడంతో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందన్నారు. కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని రెడ్‌జోన్లలో నాలుగైదు వీధులకు ఒక్క ప్రత్యేకాధికారిని నియమిస్తున్నామని తెలిపారు.

వారు వలంటీర్ల ద్వారా నిత్యావసరాల సరఫరాకు చర్యలు తీసుకుంటారన్నారు. అత్యవసర మందులకు ఒకే షాపు తెరవడంతో రద్దీ పెరిగి వైరస్‌ వ్యాపిస్తోందని, డోర్‌ డెలివరీ కోసం కర్నూలు, నంద్యాలలో టోల్‌ఫ్రీ నంబర్లను కేటాయించాలని ఆర్డీఓలను ఆదేశించారు. కర్నూలులోని గనిగల్లీ, పెద్ద మార్కెట్, మేదరు వీధి, కొత్తపేట, బుధవారపేట, ఖడక్‌పురా తదితర రెడ్‌జోన్లలో వీధుల సరిహద్దులను పూర్తిగా మూసేయాలని మునిసిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబును ఆదేశించారు. సమావేశంలో జేసీ రవిపట్టన్‌ శెట్టి, డీఆర్వో బి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

203కు చేరిన కరోనా కేసులు 
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ నెల 4వ తేదీ వరకు ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ ఉండగా 18 రోజుల్లోనే ఆ సంఖ్య 203కు చేరింది. కర్నూలులో కేసుల సంఖ్య 94 ఉండగా, నంద్యాలలో 52కు చేరింది. బుధవారం 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో కర్నూలులో 4, నంద్యాలలో 10, నందికొట్కూరులో 4, చాగలమర్రి మండలంలో ఒకటి ఉన్నాయి. కాగా.. రాయలసీమ విశ్వవిద్యాలయం, ఆళ్లగడ్డ, గోస్పాడు, ఆత్మకూరు క్వారంటైన్‌ కేంద్రాల నుంచి బుధవారం 96 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు