మనిషి నుంచి పులికి సోకిన కరోనా వైరస్‌

7 Apr, 2020 15:59 IST|Sakshi

నిర్ధారించిన అమెరికా వైద్యులు

సాక్షి, విజయవాడ : న్యూయార్కులో పులి (నాదియా)కు కరోనా వైరస్‌ సోకడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై పరీక్షలు నిర్వహించిన అమెరికా వైద్యులు పులికి మనిషి నుంచే వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. నాదియాతో పాటు మరో ఆరు పులులకు కూడా వైరస్‌ సోకినట్లు వైద్యులు ధృవీకరించారు. న్యూయార్క్‌లోని బ్రాంక్జ్‌ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి ఈ వైరస్‌ బారిన పడింది. ఈ నేపథ్యంలో భారత అటవీ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర జూ అథారిటీ హెచ్చరికలతో వన్య ప్రాణాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అటవీశాఖ ప్రత్యేక దృష్టిసారిస్తోంది. మనిషి నుంచి పులికి వైరస్‌ సోకడంపై ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ప్రతీప్ కుమార్ ‘సాక్షి’తో ముచ్చటించారు. రాష్ట్రంలోని జూలలో ఉండే వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. (పులికి కరోనా పాజిటివ్‌)

‘భారత ప్రభుత్వం, కేంద్ర అటవీశాఖ జంతు సంరక్షణకు మార్గదర్శకాలు విడుదల చేసింది. సెంట్రల్ జూ అథారిటీ సూచన మేరకు రాష్ట్రంలోని అన్ని జంతు ప్రదర్శన శాలల వద్ద  ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసాం. సీసీ కెమెరాల ద్వారా ఇరవై నాలుగు గంటలు జూ లోని జంతువుల కదలికలు పర్యవేక్షిస్తున్నాము. జంతువులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వాటి రక్త నమూనాలను సేకరిస్తాం. గతనెల 19 నుంచే జూలలో సందర్శన నిలిపివేశాం. అటవీ ప్రాంతంలో నివసించే పులులు, చిరుతలు, సింహాలకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ. సర్కస్‌ల నుంచి తెచ్చిన పులులు, సింహాలను ఏఆర్‌సీ సెంటర్లలో ఉంచి పర్యవేక్షిస్తున్నాము’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు