ఆంధ్రపదేశ్‌లో 35 పాజిటివ్‌ కేసులు

22 Apr, 2020 03:32 IST|Sakshi

ఇప్పటివరకు 757 కేసులు

డిశ్చార్జ్‌ అయిన వారు 96

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లాలో 10 గుంటూరులో 9, వైఎస్సార్‌ కడపలో 6, పశ్చిమ గోదావరిలో 4, అనంతపురంలో 3, కృష్ణాలో 3 చొప్పున పాజిటివ్‌ కేసులు వచ్చాయి. సోమవారం ఉ.9 గంటల నుంచి మంగళవారం ఉ.9 గంటల వరకు మొత్తం 5,022 శాంపిల్స్‌ని పరిశీలించగా 35 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్‌ అధికారి మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 184 కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమై అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 757కు చేరుకుంది. ఇక చికిత్స పొందుతూ పూర్తిగా కోలుకుని మొత్తం 96 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అలాగే.. వివిధ కోవిడ్‌ ఆసుపత్రుల్లో 639 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో కొత్తగా గుంటూరు జిల్లాలో కోవిడ్‌తో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 22కు చేరింది.

మహమ్మారిపై మనోధైర్యంతో కరోనాపై 85 ఏళ్ల వృద్ధురాలి విజయం
పై చిత్రంలోని వృద్ధురాలి వయస్సు 85 ఏళ్లు. శరీరం సహకరించని స్థితి.. ఈ పరిస్థితుల్లోనూ  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై ఆమె  విజయం సాధించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మరెందరికో ప్రాణాలపై ఆశలు కల్పించింది. అనంతపురం జిల్లాకు చెందిన ఈమెను ఈనెల 5న హిందూపురం ఆస్పత్రిలోని ఐసోలేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత అనంతపురం సర్వజనాస్పత్రి, అనంతరం కిమ్స్‌–సవీరాలో ఉంచి చికిత్స చేశారు. మంచి ఆహారం, వైద్యుల ఆదరణ, వారిచ్చిన మనోధైర్యంతో తాను కోలుకున్నట్లు ఆమె వెల్లడించారు.

ఏపీలో కోవిడ్‌ యోధులు 6,23,202
కోవిడ్‌ వారియర్స్‌ వెబ్‌సైట్‌లో కేంద్రం వెల్లడి
సాక్షి,న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారిపై పోరాడుతున్న 6,23,202 మంది యోధులు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం తాజాగా రూపొందించిన కోవిడ్‌ వారియర్స్‌ వెబ్‌సైట్‌లో తెలిపింది. వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు, డెంటిస్టులు, ఫార్మాసిస్టులు, ఆయుష్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రోజ్‌గార్‌ సేవక్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, వెటర్నరీ సిబ్బంది, మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఇలా మొత్తం 6,23,202 మంది కోవిడ్‌ వారియర్స్‌ అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. జిల్లా నోడల్‌ అధికారులు, ఆసుపత్రుల వివరాలు, కోవిడ్‌ను ఎదుర్కొవడంలో శిక్షణ తదితర అంశాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఆయా రంగాల ప్రతినిధులకు శిక్షణ కోర్సులపై ప్రత్యేకంగా ‘ఐగాట్‌’ వెబ్‌ పోర్టల్‌ను రూపొందించారు. తెలంగాణలో కోవిడ్‌పై పోరాడుతున్న యోధులు 3,95,129 మంది అందుబాటులో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 

మరిన్ని వార్తలు