కోవిడ్‌తో ఆకలికేకలు రెట్టింపు

22 Apr, 2020 03:37 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

పారిస్‌: ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తోన్న ప్రజల సంఖ్య కోవిడ్‌–19 కారణంగా రెట్టింపు కానుందని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం హెచ్చరించింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా కుదేలైన ప్రపంచ ఆర్థిక రంగం అంతర్జాతీయంగా ఆకలికేకలను మరింత పెంచే అవకాశం ఉన్నదని ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సమర్పించిన రిపోర్టులో వెల్లడించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తోంటే, కోవిడ్‌ ప్రభావంతో 2020 యేడాదికి ఈ సంఖ్య మరో 13 కోట్లు పెరిగి, 26.5 కోట్లకు చేరుతుందని ఆ రిపోర్టు అంచనా వేసింది. 50 దేశాలకు చెందిన గత ఏడాది రిపోర్టులను ఈ ఏడాదితో పోల్చి చూస్తే ఆహార సంక్షోభం 12.3 కోట్లకు అంటే పది శాతం పెరిగింది. వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులు లాంటి ఇతర అనూహ్య కారణాల రీత్యా మరో 18.3 కోట్ల్ల మంది ప్రజలు ఆహార సంక్షోభంలోకి జారే ప్రమాదంలో ఉన్నట్టు ఈ రిపోర్టు స్పష్టం చేసింది. అసలే ఆకలితో బాధపడుతున్న వారికి కోవిడ్‌ అత్యంత ప్రమాదకరంగా మారిందని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం సీనియర్‌ ఎకనమిస్ట్‌ ఆరిఫ్‌ హుస్సేన్‌ తెలిపారు.

ఆంక్షలు తొలగిస్తే ఉధృతి
ప్రపంచవ్యాప్తంగా అమలులోఉన్న లాక్‌డౌన్‌ ఆంక్షలను తొలగిస్తే కరోనా ఉధృతి పెరిగే ప్రమాదం ఉన్నదని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రపంచదేశాలను హెచ్చరించింది. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకోవాలనుకునే తొందరలో ఆంక్షలను ఎత్తివేయడం ప్రమాదకరమనీ, దీనివల్ల కోవిడ్‌ తిరగబెట్టే ప్రమాదం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెస్ట్రన్‌ పసిఫిక్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తకేశీ కసాయ్‌ అన్నారు. ‘వాషింగ్టన్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగారు. అలాగే ప్రపంచదేశాలు ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూనే, ఆర్థికపరమైన కార్యకలాపాలను అనుమతించాలి’ అని ఆయన అన్నారు.  అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలనే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక జారీచేసింది.

>
మరిన్ని వార్తలు