అమరావతిలో సీఎస్‌ఐఆర్‌ ప్రయోగ కేంద్రం

7 Feb, 2018 01:42 IST|Sakshi

చంద్రబాబుతో సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ భేటీ

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) ప్రయోగ, ప్రదర్శన కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ గిరీశ్‌ సాహ్నీ, సీనియర్‌ శాస్త్రవేత్తలు మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాల్ని, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదించగా.. సీఎం అంగీకారం తెలిపారు. ‘సెంటర్‌ ఫర్‌ స్కేలింగ్‌ అప్‌ అండ్‌ డిమాన్‌స్ట్రేషన్‌ ఆఫ్‌ రెలవెంట్‌ సీఎస్‌ఐఆర్‌ టెక్నాలజీస్‌’ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సవివర కార్య ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొస్తామని సాహ్ని తెలిపారు.

చంద్రబాబు మాట్లాడుతూ శాశ్వత నిర్మాణం పూర్తయ్యేవరకు వేచి ఉండనక్కర్లేదని, తాత్కాలిక ఏర్పాటు చేసుకుని వెంటనే పని ప్రారంభించాలని సూచించారు. కాగా, బౌద్ధ ఆలయం నిర్మాణానికి అమరావతిలో పదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఆలయ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, డిజైన్లు ఇవ్వాలని మంగళవారం తనను కలిసిన థాయిలాండ్‌ బృందాన్ని కోరారు. రాష్ట్రం నుంచి థాయి ఎయిర్‌వేస్‌ సేవలు నడిపేందుకు బృందం ఆసక్తి చూపగా, విజయవాడ నుంచి ప్రారంభించాలని సీఎం సూచించారు. 

నేడు చంద్రబాబు దుబాయ్‌ పర్యటన: సీఎం చంద్రబాబు బుధవారం దుబాయ్‌ పర్యటనకు వెళుతున్నారు. గురువారం అక్కడి పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులతో సమావేశమై.. విశాఖపట్నంలో ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానించనున్నారు.  

మరిన్ని వార్తలు