పారాహుషార్ బంగాళాభూతం

10 Oct, 2014 00:57 IST|Sakshi
పారాహుషార్ బంగాళాభూతం

బంగాళాఖాతం.. ఇప్పుడు జిల్లావాసులను బుస వినిపించని, పడగ విప్పని మిన్నాగులా భయపెడుతోంది. కడలి కల్పిస్తున్న ‘హుదూద్’ ఆపద ఎక్కడ తీరం దాటుతుంది, ఆ సమయంలో ఎంత విలయం సృష్టిస్తుందోనని ప్రజలు కలవరపడుతున్నారు. మరో పక్క అధికార యంత్రాంగం విపత్కర పరిస్థితి ఉత్పన్నమైతే ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది.
 
 సాక్షి, కాకినాడ :‘హుదూద్’ తుపాను పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 12న తీరం దాటనున్న ఈ తుపాను ప్రభావంతో 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చన్న అంచనాతో తీరమండలాల ప్రజలను హెచ్చరించారు. తుపాను విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెపుతున్నా దిశమార్చుకుని విశాఖ-కాకినాడ మధ్య దాటే అవకాశాలు లేకపోలేదని అధికారులుంటున్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం రాత్రికి విశాఖపట్నానికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకతమై వాయవ్యదిశగా పయనిస్తున్న హుదూద్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో కాకినాడ పోర్టులో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు మరో నాలుగైదు రోజులు మత్స్య కారులను వేటకు వెళ్లవద్దని ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌లో (నం: 1077, 0884-2359173), అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో (08856-233100), రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో (0883- 2442344) కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
 
 1977 నాటి దివిసీమ ఉప్పెన, 1996 నాటి కోనసీమ తుపానులను మించి హుదూద్ ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జిల్లా యంత్రాంగం తీర మండలాల అధికారులను స్థానికంగా అందుబాటులో ఉండాలని ఆదే శించింది. ఈనెల 13 నుంచి కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినా తుపానుతో ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు కలెక్టర్ నీతూప్రసాద్ ప్రకటించారు. కాగా తుపాను వల్ల ఉత్పన్నం కాగల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఐదు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కావాలని ప్రభుత్వం కోరింది. వీటిలో రెండు జిల్లాకు రానున్నాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే తీరప్రాంతాల్లో 162 బోట్లను, 52 మంది గజ ఈతగాళ్ళను సిద్ధం చేశారు. ఈ నెల 11 నుంచి జరగాల్సిన జన్మభూమి-మా ఊరు సభలను వాయిదా వేశారు. ప్రస్తుతం సముద్రంలో వేటకు వెళ్ళిన 20 బోట్లు సురక్షితంగా తీరం చేరేలా మత్స్యశాఖాధికారులు చర్యలు చేపట్టారు.
 
 విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం కండి ః రాజప్ప
 తుపాను నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తమై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎన్.చినరాజప్ప ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ నీతూ ప్రసాద్‌తో కలిసి తుపానును ఎదుర్కొనే సన్నద్ధతపై వివిధశాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. తుపాను ఈ నెల 12 సాయంత్రానికి గోపాల్‌పూర్-విశాఖల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్‌లు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండి ప్రజలను అన్ని విధాలా అప్రమత్తం చేయాలన్నారు. శుక్రవారం సాయంత్రానికి తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్న దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. తుని నుంచి సఖినేటిపల్లి వరకు ఉన్న తీర ప్రాంత మండలాల్లోని ప్రజలందరినీ ముఖ్యంగా ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర మండలాల్లోని బలుసుతిప్ప, భైరవపాలెం, వాసాలతిప్ప వంగి పల్లపు ప్రాంతాల వారిని అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు  తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
 మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
 తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలను కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. గురువారం రాత్రి ఆమె వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను తీరం దాటే వేళ పెనుగాలులు, భారీ వర్షంతో ఉవ్వెత్తున సముద్ర అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. అన్ని మండలాల్లో హై అలర్ట్ పాటించాలని, తుపాను పరిస్థితుల దృష్ట్యా ముప్పు తొలగే వరకు 11 నుంచి జరగవలసిన  జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుపానును ఎదుర్కొనేందుకు జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు, డీఆర్వో యాదగిరి, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
 కలెక్టర్లూ, అధికారులూ..
 తగు చర్యలు తీసుకోండి : సీఎం  
 12న తీరం దాటనున్న తుపానును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌లు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కలెక్టర్‌లకు, అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 1977లో దివిసీమ ఉప్పెన, 1996లో కోనసీమ తుపాను వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న మినిట్-టు-మినిట్ ట్రాకింగ్, వాతావరణ సిస్టంలను వినియోగించుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
 
 ప్రశాంత తీరం.. ప్రమాద సంకేతం!
 పిఠాపురం : జిల్లాకు.. ముఖ్యంగా తీరానికి తుపాన్లు కొత్త కాకపోయినా.. ఎప్పటికప్పుడు కడలి ఏస్థాయిలో కన్నెర్రజేస్తుందో, ఎంత కన్నీటికి కారణమవుతుందో, ఎన్ని కష్టనష్టాల పాలు చేస్తుందోనన్న కలవరం తప్పదు. గురువారం సముద్రతీరం ప్రశాంతంగా ఉన్నా, అలలు సాధారణంగా ఉండే దానికన్నా తక్కువస్థాయిలో ఉన్నా తీరవాసుల గుండెల్లో అలజడి రేగుతూనే ఉంది. ‘హుదూద్’ తుపాను ప్రభావంతో సముద్రం ఎలా విరుచుకు పడుతుందోనని మత్స్యకారులు గుబులు పడుతున్నారు. సాధారణంగా తుపాను హెచ్చరికలకు అంతగా జంకని ఉప్పాడ తీర మత్స్యకారులు సైతం తమ పడవలు, వలల వంటివి సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటారు. వీరి ఆదుర్దాతో అధికారులు సైతం విస్తుబోతున్నారు. సాధారణ సమయాలలో ఇసుక తిన్నెలతో కళకళలాడుతూ ఉండే సముద్ర తీరప్రాంతం ఒక్క ఇసుక రేణువు కూడా లేకుండా కొట్టుకు పోయి, బంక మట్టి కనిపించేంతగా కోతకు గురైంది. తీవ్రమైన తుపాను వచ్చే ముందే ఇలా జరుగుతుందని స్థానికులు చెపుతుండడం, సముద్రం మామూలుగా ఉండే దానికన్నా ప్రశాంతంగా ఉండడంతో అధికారులనూ ఆందోళన పరుస్తోంది.  
 

మరిన్ని వార్తలు