గోదాముల్లో ధాన్యం..రైతు బతుకు దైన్యం

9 Nov, 2014 02:20 IST|Sakshi
గోదాముల్లో ధాన్యం..రైతు బతుకు దైన్యం

ఈ రైతు పేరు మల్లికార్జునరెడ్డి. ఈయన గత రబీ సీజన్‌లో 150 బస్తాల ధాన్యాన్ని  పండించాడు. ఈ ఏడాది జనవరిలో పుట్టి రూ.9,800లు ఉండటంతో గిట్టుబాటు కాదని మార్కెట్ యార్డులో నిల్వ ఉంచాడు. రైతు బంధు పథకం ద్వారా రుణం తీసుకున్నాడు. ఏడాదవుతున్నా ధర అంతంతగానే ఉంది. నిబంధనల ప్రకారం గడువు మీరడంతో ఇతనికి నోటీసులు జారీ చేశారు. చేసేదిలేక తీసుకున్న రుణానికి 12 శాతం ప్రకారం వడ్డీ చెల్లించి నష్టానికే ధాన్యాన్ని అమ్ముకున్నాడు.   
 
 ఈయన పేరు రామాంజనేయుల రెడ్డి.బుడ్డాయపల్లెకు చెందిన ఈయన తన ఆరెకరాల పొలంలో పండిన 210 బస్తాల జిలకర మసూర ధాన్యాన్ని ఈ ఏడాది జనవరిలో మార్కెట్ యార్డులో నిల్వ ఉంచాడు. పండినప్పుడు బస్తా రూ.1500 ఉండగా ఇప్పటికీ రూ.1700లకు మించి పెరగలేదు. ఓ వైపు నోటీసులతోపాటు మళ్లీ కొత్త పంట వస్తే ఈ ధర కూడా రాదన్న భయంతో ధాన్యాన్ని అమ్మేశాడు. బస్తా రూ.2వేలు పలికితే కానీ గిట్టుబాటు కాదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 220 ధాన్యం నిల్వ చేసిన రైతులు
 
 బస్తాల సంఖ్య 30,000
 
 1.60   రైతులు తీసుకున్న రుణం (రూ. కోట్లలో )
 
 రైతులు చెల్లిస్తున్న వడ్డీ (శాతంలో) 12
 
 ప్రొద్దుటూరు:
 ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కాలంగా ఎదురు చూసినా గిట్టుబాటు ధర రాక.. కొత్త పంట మార్కెట్లోకి వస్తే ఇంకా ధర ఎక్కడ పడిపోతుందోనన్న ఆందోళనతో ఉన్నకాడికే అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో జిలకర, జగిత్యాల ధాన్యం ధరలు రూ. 12వేలు పలుకుతున్నాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఇంకా ధరలు పడిపోయే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

  ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతులు గత రబీ సీజన్‌లో  జగిత్యాల, జిలకర మసూరా ధాన్యం పండించారు. అప్పట్లో గిట్టు బాటు ధరలేకపోవడంతో యార్డులోని గోదాముల్లో సుమారు 30వేల బస్తాల వరకు ధాన్యం నిల్వ ఉంచారు. వీటిపై చాలా మంది రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ గత నిబంధనల ప్రకారం రుణబంధు పథకంపై రుణాలు తీసుకున్నారు.
 
 నిబంధనలు ఇవీ..
 ఇందులో 90 రోజుల వరకు వడ్డీ లేకుండా, 91-180 రోజుల వరకు రుణంపై 3శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 180 రోజులు దాటితే 12 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
 
 గిట్టుబాటు ధరల్లేక..
 నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరు నెలల్లో గోడౌన్‌నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరల్లేక రైతులు ఏడాదిగా ధాన్యాన్ని అలాగే నిల్వ ఉంచారు. మరోవైపు గడువు మీరిందని మార్కెట్ యార్డు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పట్లో మార్కెట్ ధర పెరిగే అవకాశం లేదని, మరో వైపు డిసెంబర్‌నాటికి మళ్లీ పంట దిగుబడి చేతికి వస్తుందనే కారణాలతో రైతులు ఉన్న ధాన్యాన్ని నష్టాలకే అమ్ముకుంటున్నారు.
 
 నిబంధనల మేరకే..

 నిబంధనల ప్రకారం రైతు లు ఆరు నెలల వరకు మాత్రమే ధాన్యాన్ని ని ల్వ ఉంచుకోవాలి. మళ్లీ సీజన్ వస్తుండటంతో రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాం.
 -నారాయణ మూర్తి,
 ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ

మరిన్ని వార్తలు