కరోనా వారియర్స్‌

1 May, 2020 12:15 IST|Sakshi

నిద్రాహారాలు మాని సేవలందిస్తున్న వైద్య సిబ్బంది

ఇంట్లోకి వెళ్లకుండా బయటే భోజనం  

పిల్లలకు దూరంగా  గడుపుతున్న వైనం  

ప్రాణాలకు తెగించి పోరాటం

  వారిద్దరూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో వైద్యులు. ప్రస్తుతం కోవిడ్‌–19 (కరోనా) కేసులకు చికిత్స చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఆసుపత్రికి వెళితే ఒక్కోసారి రాత్రి 7 దాటుతుంది. కొన్నిసార్లు ఉదయం టిఫిన్‌ చేయడం వీలు పడడం లేదు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లినా బయటే కూర్చుని భోజనం చేస్తున్నారు. పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేకపోతున్నారు.  
.. వీరే కాదు కోవిడ్‌ విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది అందరిదీ ఇదే పరిస్థితి.  

కర్నూలు(హాస్పిటల్‌): ‘కరోనా’ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ, మెడికల్‌ కాలేజి, ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలు మరువలేనిది. జిల్లా వ్యాప్తంగా 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 161 మంది మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు మొత్తం 300 పైగా సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. వీరితో పాటు కర్నూలు జీజీహెచ్, మెడికల్‌ కాలేజీలోని ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, పీజీ డాక్టర్లు కరోనా వారియర్స్‌గా పోరాటం చేస్తున్నారు. అంతేగాక సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో వైద్యులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్సులు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులు సైతం తమ గురుతర బాధ్యతలను మరిచిపోకుండా పనిచేస్తున్నారు. మెడికల్‌ కాలేజిలో ఏర్పాటు చేసిన ల్యాబోరేటరీలో వైద్యులతో పాటు ప్రతి బృందంలో ఆరుగురు డిజిటల్‌ అసిస్టెంట్‌లు, ల్యాబ్‌టెక్నీషియన్లు, పీజీ మెడికల్‌ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ టీమ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణతో పాటు రెండు బృందాల్లో ఎనిమిది మంది వైద్యులు, మెడికల్‌ కాలేజిలో పీజీ విద్యార్థులు ఉన్నారు.  

కోవిడ్‌ ఆసుపత్రుల్లో...
కోవిడ్‌ ఆసుపత్రులు అయిన నంద్యాలలోని శాంతిరామ్‌ జనరల్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌ వెంకటనారాయణమ్మ, డాక్టర్‌ శాంతారామ్‌ నాయక్, డాక్టర్‌ చంద్రశేఖర్, విశ్వభారతి కోవిడ్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌ మల్లికార్జున, డాక్టర్‌ చంద్రారావు, జీజీహెచ్‌లో పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ రమణయ్య, డాక్టర్‌ మనోజ్, డాక్టర్‌ ప్రభావతితో పాటు పారామెడికల్, నర్సులు, ఏఎన్‌ఎంలు వైద్యసేవలు అందిస్తున్నారు. అలాగే 104, 108, ఆయుష్‌ డాక్టర్లు, ప్రైవేటు వైద్యులు వందలాది మంది కరోనా వైరస్‌ నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 24 క్వారంటైన్‌లు ఉండగా అందులో సోమవారానికి ఏడు పూర్తిగా ఖాళీగా మారాయి. ప్రస్తుతం 17 క్వారంటైన్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి. 

ఒక వారం డ్యూటీ, రెండు వారాలు క్వారంటైన్‌లో...
అతిక్లిష్ట సమయంలో రెండు వారాలుగా వైద్యులు సేవలను పరిశీలిస్తే అనేక మానవీయ కోణాలు కనిపిస్తాయి. వైద్యులు ఒక వారం కోవిడ్‌ డ్యూటీ చేస్తే రెండు వారాలు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండాలి. ఆ తర్వాత నాలుగో వారం వెంటనే మళ్లీ కోవిడ్‌ విధుల్లో చేరాలి. వారం తర్వాత మళ్లీ క్వారంటైన్‌. ఇలా పూర్తిగా వారి జీవితాన్ని కోవిడ్‌ డ్యూటీకి అంకితం చేశారు. ప్రాణాంతక వ్యాధి అయిన కరోనా సోకిన వ్యక్తులకు సేవలందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.  

పీపీఈ కిట్‌ వేసుకుని పనిచేస్తున్నాం
సెంట్రీఫ్యూజ్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా పీపీఈ కిట్‌ వేసుకుంటాం. రక్తం చేతికి తగలకుండా చేతికి గ్లౌజ్‌ వేసుకుని, ఎన్‌–95 మాస్క్‌ ధరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. మీరు ఆసుపత్రిలో చేస్తున్నారని చుట్టుపక్కల వారు అంటున్నారు. దీనివల్ల కాస్త ఇబ్బందిగానే ఉంది.             –బి.కుమార్,  ల్యాబ్‌ టెక్నీషియన్,               కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల

ఉక్కపోతను భరిస్తూ..
కరోనా సోకిన రోగులకు ఐసోలేషన్‌ విభాగంలో మండే ఎండలో ఉక్కపోతకు గురిచేసే పీపీఈ కిట్లను వేసుకుని గంటల తరబడి వైద్యసేవలందిస్తున్నారు. రోగి ఆరోగ్యపరిస్థితి గమనించి వైద్యులు చికిత్సను అందిస్తుంటే.. నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది  రోగికి అవసరమైన మందులు ఇవ్వడం, పరీక్షలకు గళ్ల, రక్తం తీయడం, పారిశుద్ధ్య కార్మికులు పరిశుభ్రత చర్యలు చేపట్టడం నిత్యం జరుగుతోంది.

రోగులకు అన్ని సేవలు అందిస్తున్నాం
పెద్దాస్పత్రిలో ప్రస్తుతం 50 మందికి పైగా కరోనా పాజిటివ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నాం. ప్రతి షిఫ్ట్‌లో 10 మంది వైద్యులు ఉంటారు. మూడు షిఫ్ట్‌లలో వారు పనిచేస్తారు. ఎమర్జెన్సీ వారిని ఐసీయూలో, నాన్‌ ఎమెర్జెన్సీ వారిని వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం. రోగి కుటుంబ సభ్యులెవ్వరూ సహాయకులుగా ఉండకూడదు. ఈ కారణంగా వైద్య సిబ్బంది  పీపీఈ కిట్లు ధరించి అన్ని సేవలూ అందిస్తున్నారు.  –డాక్టర్‌ రంగనాథ్, జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్, పెద్దాసుపత్రి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు