దోషులెవరో తేల్చండి

26 Feb, 2015 00:46 IST|Sakshi

కొనకనమిట్ల : భూవివాదం నేపథ్యంలో మంగళవారం హత్యకు గురైన మండలంలోని పుట్లూరివారిపల్లెకు చెందిన కుమ్మిత నరసింహారెడ్డి మృతదేహంతో బంధుమిత్రులు బుధవారం నిరసనకు దిగారు. సుమారు గంట పాటు స్థానిక తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్‌ల ఎదుట మార్కాపురం-పొదిలి రహదారిపై మృతదేహం ఉంచి రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. పోస్టుమార్టం అనంతరం నరసింహారెడ్డి మృతదేహాన్ని ట్రాక్టర్‌పై ఉంచి ఊరేగింపుగా కొనకనమిట్ల తీసుకెళ్లారు. భారీగా వచ్చిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి బిగ్గరగా నినాదాలు చేశారు.

ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు. నరసింహారెడ్డి భార్య రమాదేవి న్యాయం చేయాలని వేడకుంటూ పోలీసుస్టేషన్ ఎదుట సొమ్మసిల్లింది. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాస్తారోకోతో గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పొదిలి సీఐ రవిచంద్ర, కొనకనమిట్ల, తాడివారిపల్లి, మర్రిపూడి ఎస్సైలు మస్తాన్ షరీఫ్, శివనాగిరెడ్డి, సుబ్బారావులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హ ంతకులను పట్టుకొని అరె స్టు చేస్తామని, చట్టపరంగా న్యాయం చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
 
తహశీల్దార్‌పై కేసు నమోదు చేయాలి
బీడు భూములకు సంబంధించి బ్రోకర్ల మాటలు విని ఎన్ని అక్రమాలు చేయాలో అన్ని అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్‌పై కేసు నమోదు చేయాలని నరసింహారెడ్డి బంధువులు డిమాండ్ చేశారు. తహశీల్దార్‌ను అరె స్టు చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్రమ పాసు పుస్తకాల మంజూరులో చేతివాటం ప్రదర్శించిన  కొనకనమిట్ల రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పుట్లూరివారిపల్లి మహిళలు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు