నిఠారీ హత్యలు: అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

16 Oct, 2023 14:14 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై  ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో  నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్‌పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం  నిర్ధారించింది.

అత్యాచారం, హత్య ఆరోపణలపై  దోషులుగా తేల్చిన ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్‌లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్‌హెచ్‌ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా  కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు.

2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్‌ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్‌వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది.

కాగా సురేంద్ర కోలీపై  బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో,  20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్‌ హత్య కేసులో  స్పెషల్‌ CBI కోర్టు  పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్‌ హైకోర్టుకూడా సమర్ధించింది.   అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది.  ఈ నిఠారీ హత్యల్లో  మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

మరిన్ని వార్తలు