డబుల్ డెక్కర్‌కు ఆదరణ కరువు

5 Apr, 2016 00:49 IST|Sakshi
డబుల్ డెక్కర్‌కు ఆదరణ కరువు

కనీసం 10 శాతం కూడా నిండని రైలు
రూటు, వారాలే కారణమంటున్న ప్రయాణికులు

 
నగరంపాలెం : గుంటూరు రైల్వే డివిజనులో ఖాజీపేట నుంచి గుంటూరు వరకు నడుపుతున్న డబుల్ డెక్కర్ రైలుకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. సికింద్రాబాద్ వైపునకు మరిన్ని రైళ్లు నడపాలని డివిజను ప్రజల విన్నపాలకు ప్రతిఫలంగా రెండేళ్ల కిందట రైల్వే ఉన్నతాధికారులు డివిజనుకు డబుల్ డెక్కర్ బైవీక్లీ రైలును ఏర్పాటు చేశారు. అయితే.. ఇది సికింద్రాబాద్ నుంచి కాకుండా ఖాజీపేట- గుంటూరు- ఖాజీపేటకు మంగళవారం, శుక్రవారాల్లో నడుస్తోంది. పూర్తి ఏయిర్ కండీషన్డ్‌తో 1200 మంది సీటింగ్ సామర్థ్యం కలిగిన ఈ రైలు ప్రారంభించినప్పటి నుంచి పండుగల రద్దీ సమయంలో మినహా మిగతా సమయాల్లో 10 శాతానికి మంచి ప్రయాణీకులు ప్రయాణించడం లేదు.


 సమస్య ఎక్కడుందంటే..
ఇది వారం మధ్యలోని మంగళ, శుక్రవారాల్లో ఉండటం ఒక సమస్య అయితే.. గుంటూరు నుంచి ఖాజీపేట మాత్రమే వెళ్లటం మరో సమస్యగా మారింది. టిక్కెట్టు ధరలు ఎక్కువగా ఉండటం, ఖాజీపేటకు పిడుగురాళ్ల వైపు నుంచి రైలు ఉండటంతో ప్రయాణికులు ఎక్కువ ధర వెచ్చించి దీనిలో ప్రయాణించలేకపోతున్నారు. దీన్ని గుంటూరు నుంచి విజయవాడ వైపు ఖమ్మం మీదుగా సికింద్రాబాద్‌కు నడిపితే అనుకూలంగా ఉంటుందని  ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు.

అదే విధంగా నడిపే రోజులైనా వారంతం లేదా వారం మొదటి రోజుల్లో (ఆదివారం లేదా సోమవారం) నడిపితే ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. వేసవి కావటంతో ప్రజలకు అనువైన రూట్‌లో డబుల్ డెక్కర్ నడిపితే ప్రయాణీకులకు సౌకర్యవంతగా ఉంటుందని, రైల్వేకూ లాభాదాయకంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు