పది గంట మోగింది..!

11 Nov, 2017 08:54 IST|Sakshi

మార్చి 15 నుంచి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల

జిల్లా నుంచి హాజరుకానున్న 35 వేల మంది టెన్త్‌ విద్యార్థులు

పరీక్షలకు ఉన్నగడువు 124 రోజులు

ఇందులో సెలవు దినాలు 40  

వీరఘట్టం: వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేయడంతో విద్యార్థులంతా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించి ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం నుంచి మార్చి 15వ తేదీ పరీక్షల నాటికి ఇంకా 124 రోజుల సమయం ఉంది. ఇందులో 5 రెండో శనివారాలు, 18 ఆదివారాలు, జనవరిలో 11 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు, ఇతర సెలవులను కలుపుకుంటే 40 రోజులు బడులు మూతపడనున్నాయి. ఈ సెలవులు మినహాయిస్తే ఇంకా 84 పాఠశాల పనిదినాలు మాత్రమే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులతో పాటు ఎస్‌.ఎ.2 పరీక్షలు, ప్రీపబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు.

35 వేల మంది హాజరు....
వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థల నుంచి సుమారు 35 వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశముంది. పరీక్షల టైం టేబుల్‌ విడుదల కావడంతో విద్యార్థులను ఎ,బి,సి,డి కేటగిరీలగా విభజించి వీరిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం ఐదుగురు విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ప్రత్యేక బోధన చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మరిన్ని వార్తలు