కారుచీకట్లు

7 Oct, 2013 02:18 IST|Sakshi

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో అంధకారం అలుముకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు అల్లాడిపోయారు. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత  ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా సమైక్యవాదులు అడుగు ముందుకేశారు.
 
 విద్యుత్  సరఫరా నిలిపివేసి నిరసన తెలపడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం తప్పలేదు. తెలంగాణ అంశంపై కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పును బట్టే ఉద్యమ స్వరూపం కూడా మారు సాక్షి, కడప: సమైక్య ఉద్యమం ఆదివారం జిల్లాను అంధకారంలోకి నెట్టింది. విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ఆదివారం ఉదయం 10.45 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె జనాలు కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
 
 ఆర్టీపీపీలో పూర్తిగా నిలిచిపోయిన విద్యుదుత్పత్తి:
 ఆర్టీపీపీ(రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు)లోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం కలిపి 2,700మంది  సమ్మెలోకి వెళ్లడంతో 5 యూనిట్లలోని 1050 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయింది. దీంతో పాటు శ్రీశైలం నుంచి వచ్చే సరఫరాను కూడా గ్రిడ్‌కు అనుసంధానం చేయకపోవడంతో జిల్లాలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీసం చేతిపంపు నీటి కోసం తిరిగినా నగరంలో ఎక్కడా చేతిపంపులు కనిపించలేదు.
 
 కొంతమంది ఇరుగుపొరుగు ఇళ్లలోని నీటితో సర్దుకుంటే, మరికొందరు ఇంట్లో నిల్వచేసుకున్న కార్పొరేషన్ నీటినే సేవించాల్సి వచ్చింది. కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క చాలామంది తీవ్ర ఇబ్బంది పడ్డారు.  ఆదివారం రాత్రి 7 గంటలకు కరెంటు వస్తుందనే ప్రచారంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒకదశలో పూర్తిగా రాదని తెలియడంతో తీవ్ర ఆందోళన చెందారు. రాత్రి వేళలో కరెంట్ లేక దోమల బెడదతో అల్లాడారు. ఫ్యాన్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడ్డారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని పట్టణప్రాంతాల్లోనూ సంభవించింది. పల్లెల్లో కూడా కరెంటు సమస్యలు స్పష్టంగా కన్పించాయి. ఎట్టకేలకు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
 దసరాపై కరెంటు ప్రభావం
 దసరా ఉత్సవాలపై కరెంటుకోత ప్రభావం పడింది. శనివారం రాత్రి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రొద్దుటూరు అమ్మవారిశాల, శివాలయంతో పాటు కడపలోని విజయదుర్గాదేవి, అమ్మవారిశాల,మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రాజంపేటలోని అమ్మవారి ఆలయాలు శనివారం విద్యుత్‌దీప కాంతులతో వెలుగులీనాయి. అయితే ఆదివారం కరెంటుకోతతో ఆలయాల్లో చిమ్మచీకట్లు కమ్మాయి. కొన్నిచోట్ల జనరేటర్లను ఉపయోగించి సమస్యను అధిగమించారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు కూడా కరెంటు సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
 కరెంటు నిలిపేయడం సరికాదు: థామస్, ఇంజనీర్, కడప
 సమైక్య ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. బంద్‌లతో పాటు అన్ని నిరసన కార్యక్రమాలకు సహకరించారు. చివరకు ప్రభుత్వ పాఠశాలలు మూసి ప్రైవేటు పాఠశాలలు తెరిచినా ఉద్యమం కోసం సహించారు. కానీ చివరకు కరెంటును తొలగించడం దారుణం. చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఇబ్బంది పడారు. వెంటనే కరెంటును సరఫరా చేయాలి.
 
 వెంటనే కరెంటు సరఫరా చేయాలి: ప్రసన్నకుమారి, విద్యార్థిని, కడప
 సమైక్య ఉద్యమం తప్పుదారి పడుతోంది. కరెంటు తీసేయడం దారుణం. పగలంటే సరే. రాత్రి పూట కరెంటు తీసేస్తే దొంగతనాలు జరిగే ప్రమాదముంది. తాగునీటితో పాటు రాత్రి పూట నిద్రపోవాలన్నా కష్టంగానే ఉంది. కరెంటు నిలిపేయడం సరైన చర్యకాదు. వెంటనే కరెంటు సరఫరా చేయాలి.
 

మరిన్ని వార్తలు