‘ఉపాధి’ పీవోలుగా ఎంపీడీవోలు

30 Sep, 2014 01:14 IST|Sakshi
‘ఉపాధి’ పీవోలుగా ఎంపీడీవోలు
  • 18 నెలల తరువాత మళ్లీ అధికారం
  •  ఒకటి నుంచి పర్యవేక్షణ బాధ్యత
  • యలమంచిలి : ఉపాధిహామీ పథకం బాధ్యతలను ప్రభుత్వం 18 నెలల తర్వాత మళ్లీ ఎంపీడీవోలకు అప్పగించింది.  ఈ మేరకు ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 2007 జూన్ 19న ఎంపీడీవోలను ఉపాధి హామీ పథకం అధికారి (పీవో)లుగా నియమిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీవో 276 జారీ అయింది.  క్షేత్రస్థాయి పనుల్లో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయంటూ సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి.

    ఇందులో పీవోల హోదాలో ఎంపీడీవో పాత్ర కూడా కీలకమేనన్న ఆరోపణలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. వారిని బాధ్యులను చేస్తూ రికవరీ పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీడీవోలు ఆందోళన చేపట్టారు. ఉపాధి పీవోలుగా తాము పనిచేయలేమంటూ తెగేసి చెప్పారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్ కీ (డీఎస్‌కే) వెనక్కి ఇచ్చారు. దీంతో అదనపు పీవోలకు ఇన్‌చార్జ్ పీవోలుగా ఎఫ్‌ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ 2013 మార్చి ఒకటిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ (సీఆర్డీ) ఉత్తర్వు 472ను జారీ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఏపీవోలే పీవోల బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నారు.

    తాజాగా మళ్లీ ఎంపీడీవోలకే పీవోల బాధ్యతలనిస్తూ జీవో 139 జారీ అయింది. అక్టోబర్ ఒకటి నుంచి ఎంపీడీవోలు ఈ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకానికి అదే పథకంలో పనిచేసే ఏపీవోలే అన్నీ తామై పనిచేశారు. కొత్తప్రభుత్వం ఉపాధి పనుల మరింత వేగవంతానికి ఎంపీడీవోలనే పీవోలుగా ఉంచాలని భావించింది. నెల రోజుల క్రితం యలమంచిలి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ఎంపీడీవోలకు ఉపాధి పనుల బాధ్యత అప్పగించనున్నట్టు వెల్లడించారు.
     
    పనులు వేగవంతం... : ఉపాధి పనుల వేగవంతానికి ఎక్కడెక్కడ ఏఏ పనులు చేపట్టాలి, చేపట్టేవి ఉపయోగకరమైనవా, కాదా, జాబ్‌కార్డుల నమోదు, గ్రామ పంచాయతీ పరిధిలో చేసిన పనులకు బిల్లులు ఆలస్యం కాకుండా చూడటం, దరఖాస్తుదారులందరికీ పనులు కల్పించడంతో పాటు డిజిటల్ కీతో కూడిన సాఫ్ట్‌వేర్‌లో వివరాలన్నింటిని నమోదు చేయాల్సి ఉంటుంది.

    చేసిన పనులకు, తీసిన కొలతలకు సరిపడా తయారు చేసిన ఎంబుక్‌లో సంతకాలు చేస్తేనే ఇక నుంచి కూలీలకు చెల్లింపులు జరుగుతాయి. తాజా ఉత్తర్వు ప్రకారం ఉపాధి హామీ పథకంలో ఎంపీడీవోతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ విస్తరణాధికారి (ఈవోపీఆర్డీ), ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను కూడా భాగస్వాములు కానున్నారు.

మరిన్ని వార్తలు