సరైన పత్రాలుంటేనే ప్రవేశం

5 May, 2020 03:44 IST|Sakshi
గరికపాడు రాష్ట్ర సరిహద్దు వద్ద ప్రయాణికుల పాసులు పరిశీలిస్తున్న సీఐ నాగేంద్రకుమార్‌

డీజీపీ కార్యాలయం పాస్‌లతోనే ఏపీలోకి అనుమతి

దిగువ స్థాయి పోలీస్‌ అధికారుల పత్రాలు చెల్లవు

పాస్‌లను పరిశీలించి సక్రమంగా ఉన్నవారినే అనుమతించిన పోలీసులు  

సాక్షి, గుంటూరు/అమరావతి, జగ్గయ్యపేట: అధికారిక అనుమతి(పాస్‌లు) లేకుండా ఏపీ సరిహద్దులు దాటి వచ్చేందుకు జరుగుతున్న యత్నాలు చెక్‌పోస్టుల వద్ద ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని గరికపాడు, పొందుగల, కొవ్వూరు ప్రాంతాల్లో సోమవారం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సరైన అనుమతులు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతించాలని పట్టుబట్టడం సమస్యకు దారితీసింది. గరికపాడు చెక్‌పోస్టు వద్ద సీఐ నాగేంద్రకుమార్‌ పాసులను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్న వారిని మాత్రమే ఏపీలోకి అనుమతించారు. వివరాలలోకి వెళితే.. 

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించిన కేంద్రం వలస కూలీలతోపాటు యాత్రికులు, సొంత ఊర్లకు వెళ్లేవారి ప్రయాణాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉంటున్న ఏపీకి చెందినవారు స్వస్థలాలకు బయలుదేరారు. వారికి తెలంగాణ పోలీసులు ఈ–పాస్‌లు జారీ చేశారు. అయితే ఈ–పాస్‌ల ప్రక్రియలో గందరగోళం నెలకొనడంతో సమస్య ఏర్పడింది. 

► సాధారణంగా రాష్ట్రం లోపల వేరే జిల్లాలకు వెళ్లడానికి ఆయా జిల్లాల ఎస్పీలు ఈ–పాస్‌లు జారీ చేస్తున్నారు. వేరే రాష్ట్రంలోకి వెళ్లాల్సి ఉంటే డీజీపీ కార్యాలయం నుంచి ఈ–పాస్‌లు మంజూరు చేస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా తెలంగాణ నుంచి ఏపీ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌(సీఐ), డీఎస్పీ, ఏసీపీ, జిల్లా ఎస్పీలు ఇబ్బడిముబ్బడిగా ఈ–పాస్‌లు జారీ చేశారు. ఇలా గత రెండు రోజుల్లో తెలంగాణలో ఎనిమిది వేలకుపైగా పాస్‌లు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఏపీకి చెందినవారే ఐదువేల మంది వరకు ఉంటారని అంచనా. ఈ పాస్‌లతో ఏపీకి బయలుదేరిన వారికి చెక్‌పోస్టుల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డీజీపీ కార్యాలయం నుంచి కాకుండా దిగువస్థాయి అధికారులు జారీ చేసిన పాస్‌లు కావడంతో రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్‌ పోస్టుల్లో ఏపీ పోలీసులు వారిని అనుమతించడం లేదు. 

► డీజీపీ కార్యాలయం కాకుండా ఇతరులు మంజూరు చేసిన పాస్‌లతో వచ్చిన సుమారు వెయ్యి మందిని గుంటూరు జిల్లా పొందుగుల చెక్‌ పోస్ట్‌ వద్ద ఏపీ పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. కొవ్వూరు, నాగార్జునసాగర్, గరికపాడు ప్రాంతాల్లోనూ అడ్డుకుని వెనక్కి పంపించారు.

నిరాకరణకు కారణాలివే..
► ఎక్కడివారు అక్కడే ఉండటం, వ్యక్తిగత దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా ఆటకట్టించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. గత 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయడం, వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యలు విస్తృతంగా చేపట్టడం వల్ల పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఇటువంటి సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావడం మంచిది కాదు. 

► ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి పాజిటివ్‌ అయితే ఆసుపత్రికి, నెగిటివ్‌ అయితే 14 రోజులు క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచాలన్నది నిబంధన. స్థానిక అధికారులు మంజూరు చేసిన పాస్‌లు తీసుకుని రాష్ట్రంలోకి అనుమతిస్తే క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతుల కల్పన కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని ఏపీలోకి నేరుగా అనుమతించకుండా, హెల్త్‌ ప్రొటోకాల్‌ మేరకు మాత్రమే అనుమతిస్తున్నారు.

అర్ధం చేసుకుని సహకరించండి
కరోనా విపత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు బాధ్యతతో వ్యవహరించాలి. అధికారిక అనుమతులు లేకుండా రాష్ట్రంలోకి రావద్దు. దయచేసి అర్థం చేసుకుని పోలీసులకు సహకరించండి. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వారికి డీజీపీ కార్యాలయం జారీ చేసే ఈ–పాస్‌లు కచ్చితంగా ఉండాలి. రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఏపీకి చెందిన వారు ఎక్కడ ఉన్నా అందర్నీ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు దశలవారీగా చర్యలు చేపట్టాం.     
– గౌతమ్‌ సవాంగ్, డీజీపీ  

మరిన్ని వార్తలు