కొత్త కలయికలతో కలహాలు

28 Jan, 2014 02:33 IST|Sakshi
  •   తలనొప్పిలా మారిన సమీకరణలు
  •   చంద్రబాబు వద్దే అమీతుమీ
  •   జిల్లా టీడీపీలో వింత పరిస్థితి
  •  
    సాక్షి ప్రతినిధి, విజయవాడ : తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంట్ సీటుపై అనిశ్చితి కొనసాగుతోంది. వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌రావు పేర్ల తరువాత కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నాయకత్వం నేడు మరో అభ్యర్థి వేటలో పడింది. రెండుకళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీపై ప్రజల్లో ఆదరణ తగ్గడంతో కేవలం ‘ఆర్థిక’ బలవంతులనే అభ్యర్థులుగా ప్రకటించాలని నాయకత్వం యోచిస్తోంది. అధిష్టానం ఆలోచనలు తమ్ముళ్ల మధ్య కీచులాటలకు దారితీస్తోంది. రెండు రోజల క్రితం నగరానికి వచ్చిన పార్టీ పరిశీలకుడు సుజనాచౌదరి ముందే తమ్ముళ్లు వ్యవహరించిన తీరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
     
    ఉమ-నాని వర్గపోరు..
     
    కొంతకాలంగా దేవినేని ఉమ కేంద్రంగా జిల్లా టీడీపీలో నివురుగప్పిన నిప్పులా రగులుతున్న విభేదాల సెగ తాజాగా మరింత రాజుకుంది. ఇందుకు దారితీసిన కారణాలు అనేకం ఉన్నాయి. ‘వస్తున్నా మీ కోసం’ అంటూ గత ఏడాది జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్ర ఖర్చులకోసం కేశినేని నానికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపై  ఇక్కడి పార్టీలో వర్గపోరు తీవ్రమైంది. అదేక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమ తీరుపై వల్లభనేని వంశీమోహన్, గద్దే రామ్మోహన్, బొండా ఉమ అనుయాయులు తీవ్రంగా మండిపడ్డారు. మారిన సమీకరణల నేపథ్యంలో దేవినేని ఉమ విజయవాడ పార్లమెంట్‌కు మరో అభ్యర్థిని నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారని తెలుసుకున్న కేశినేని నాని తనకు ఎంపీ టికెట్ రాదేమోనన్న కలవరపాటుకు గురికావడంతో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నాని జిల్లాలోని పలువురు నేతల వద్ద ఉమ వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది.
     
    పాతనీరు దారెటు..
     
    అధికార పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని సుజనాచౌదరి గొప్పలు చెప్పినా.. కొత్తనీరు వస్తే పాతనీరు పోవాల్సిందేనా అంటూ తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. సీటు కోసం,  పదవుల కోసం కొందరు కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నా.. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల టికెట్లపై ఆశలుపెట్టుకున్న వారంతా కినుకవహించే ప్రమాదం లేకపోలేదు. కొత్త చేరికల కోసం టీడీపీ ఆసక్తిచూపితే పాత నేతల నుంచి తిరుగుబాటు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు వద్దే అదనుచూసి పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
     
     కలహాలకు కారణాలివీ..
     
    సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి మునిగిపోయే నావలా ఉండడంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు.  జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఆయన సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది. మంత్రి సారథిని టీడీపీలో చేర్చుకుని సీటిస్తే పెనమలూరులో  తమ సంగతేమిటని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు సుజనా చౌదరి వద్ద నిలదీసినంత పనిచేశారు. ఇప్పటికే వైవీబీ రాజేంద్రప్రసాద్, బోడే ప్రసాద్ నడుమ రగులుతున్న వర్గపోరు ఆ పార్టీ పుట్టి ముంచేలా మారింది.

    ఇది చాలన్నట్టు మంత్రి సారథి చేరిక ప్రస్తావన తెలుగుదేశం పార్టీకి ఇంటిపోరును మరింత పెంచడానికి దారితీసింది. మంత్రికి సన్నిహితుడైన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వస్తే  నూజివీడు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. తనకు నూజివీడు సీటు ఇవ్వొచ్చు కదా, కాంగ్రెస్ నుంచి నాయకుల్ని తెచ్చుకుని టికెట్ ఇస్తారా.. అంటూ  ఎదురుదాడి చేయడంతో టీడీపీ నేతలకు మింగుడు పడటంలేదు.
     

>
మరిన్ని వార్తలు