నిధులున్నా నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

నిధులున్నా నిర్లక్ష్యం

Published Tue, Jan 28 2014 2:29 AM

officers showing negligence to develope

 విషయం         : ఏసీడీపీ నిధులు
 వచ్చినవి         : రూ.43.47 కోట్లు
 ఖర్చయినవి     : రూ.33.09 కోట్లు
 ఖజానాలో        : రూ.10.38 కోట్లు
 సమయం         : రెండు నెలలు
 
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
 శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం నిధుల(ఏసీడీపీ) వినియోగంపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇన్‌చార్జి మంత్రుల నిధులు సకాలంలో ఖర్చుకాకపోవడంతో మురిగిపోనున్నాయి. ఏసీడీపీ కింద జిల్లాకు రూ.43.47 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.33.09 కోట్లు ఖర్చు చేశారు. 2014 మార్చి 31లోగా నిధులు ఖర్చు చేయాలి. అంటే రెండు నెలల వ్యవధిలో రూ.10.38 కోట్లు ఖర్చు కావాలి. ఇది సాధ్యం అయ్యేట్లుగా లేదు. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు ఏటా విడుదలయ్యే నిధుల్లో అత్యధికంగా తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేయాలి. నిధులు ఖర్చు చేయకపోవడంతో అభివృద్ధి పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. తాగునీరు, రోడ్ల నిర్మాణం పనులు పూర్తిగా నిలిచాయి.
 
 నిధుల విడుదల, వినియోగం..
 అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం మంజూరయ్యే నిధులతోనే ఆయా నియోజకవర్గాల్లో ప్రగతి పనులు చేపట్టాలి. సీసీ రోడ్లు, కల్వర్టులు, ఆలయాలు, ప్రార్థన మందిరాలు, ప్రహరీలు, కమ్యూనిటీ హాళ్లు, తాగునీటి అవసరాల కోసం వినియోగించవచ్చు. డ్రెయినేజీల నిర్మాణం, వంతెనలు, నీటి ట్యాంకులు, గ్రామ పంచాయతీ భవనాలు, మైనర్ ఫీడర్ చానల్స్, ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుకు ఖర్చు చేయవచ్చు. ఏటా ఏసీడీపీ కింద ఒక్కో నియోజకవర్గానికి రూ.1 కోటి మంజూరైతే ఇందులో రూ.50 లక్షల పనులను నేరుగా స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులను ప్రతిపాదించవచ్చు. మిగతా రూ.50 లక్షలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి తన కోటాగా పరిగణించి అభివృద్ధి పనులకు ప్రతిపాదించినా.. స్థానిక ఎమ్మెల్యే సిఫారసుల మేరకు ఖర్చు చేస్తారు. ఇక్కడే ఏసీడీపీ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేనిచోట్ల పార్టీ నియోజకవర్గం బాధ్యులు సూచించిన పనులు ఇన్‌చార్జి మంత్రులు మంజూరు చేస్తూ నిధులు దారి మళ్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
 

Advertisement
Advertisement