సురేష్‌ దాదా..!

13 Sep, 2019 12:02 IST|Sakshi
ఆస్పత్రి వద్ద తనిఖీలు చేస్తున్న సబ్‌ కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, డాక్టర్‌ అవతారమెత్తిన సురేష్

అతనొక కాంపౌండర్‌. ఏడాదిన్నర నుంచి స్కిన్, హెయిర్‌ స్పెషలిస్ట్‌ ఎండీ, ఎంఎస్సీ, పీజీడీసీసీ అర్హతల డాక్టర్‌గా కొనసాగుతున్నాడు. పట్టణంలో ప్రైవేట్‌ ఆస్పత్రులను తలదన్నే రీతిలో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ మెషిన్లు, బెడ్‌లు ఏర్పాటు చేసుకున్నాడు.  శంకర్‌దాదా.. ఎంబీబీఎస్‌ సినిమా తరహా అవతారమెత్తి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా దర్జాగా ఆస్పత్రినే నిర్వహిస్తున్నాడు.  పట్టణంలో ప్రముఖ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ఆస్పత్రులు కేంద్రీకృతమై ఉండే క్రిస్టియన్‌ పేటలో ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కొత్త డాక్టర్, ఆస్పత్రి విషయమై స్థానికంగా ఉండే డాక్టర్లకు అనుమానాలు ఉన్నా.. ఆయన ఎవరో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తున్నాడు. అదీ ఏడాదికి పైగా కొనసాగుతుండడం వైద్యశాఖ నిర్లక్యానికి అద్దం పడుతోంది.

సాక్షి, కావలి: వైద్యులుగా సాధారణంగా ఎంబీబీఎస్‌ చదివిన వారు ఉంటారు. ఇక ఒక్కో రకం వైద్యంలో స్పెషలైజేషన్‌ చేసిన వారు ఆపై చదువు అయిన ఎండీ చేసి ఉంటారు. కానీ కావలిలో సాధారణ వ్యక్తి చర్మ వ్యాధులకు సంబంధించి స్పెషలైజేషన్‌ ఎండీ చేసినట్లుగా ఏకంగా బోర్డు పెట్టి పెద్ద భవంతిలోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. పట్టణానికి సమీపంలో ఉన్న ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన ఓ సురేష్‌ చాలా కాలంగా కావలిలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కంపౌండర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అతను కావలిలో కనిపించకుండా పోయాడు.

ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం పట్టణంలోని క్రిస్టియన్‌పేట ఐదో లైన్‌లో ఒక భవనంలో ఏకంగా ఎస్‌ఎస్‌ఎం క్లినిక్‌ అనే పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. ఆ ఆస్పత్రి వద్ద డాక్టర్‌ ఓ.సురేష్‌ అనే బోర్డు తగిలించాడు. ఆ బోర్డులో ఎండీ, ఎంఎస్సీ, పీజీడీసీసీ తన విద్యార్హతలుగా పేర్కొన్నాడు. స్కిన్, హెయిర్, లేజర్‌ వైద్య నిపుణుడిగా కనపరిచాడు. ఆస్పత్రిలో చికిత్స చేయడానికి రెండు మెషిన్లు, బెడ్‌లు సమకూర్చాడు. ఒక యువతిని నర్సుగా పెట్టుకొన్నాడు. రోగులకు మందులు రాసి ఇచ్చే ప్రిస్కిప్షన్‌ పై భాగంలో డాక్టరు పేరుతో పాటు మెడికల్‌ బోర్డులో వైద్యుడిగా రిజస్ట్రేషన్‌ చేసుకున్న నంబర్‌ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ నకిలీ డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ కాగితంలో ఎక్కడా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదు.

సమాచారం తెలుసుకున్న కావలి సబ్‌ కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ వైద్య శాఖ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ టి.విజయకుమార్, డాక్టర్‌ పీసీ కోటేశ్వరరావు, సిబ్బంది కలిసి సంయుక్తంగా గురువారం ఆస్పత్రిలో తనిఖీకి వచ్చారు. ఈ విషయం తెలుసుకుని నకిలీ డాక్టర్‌ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. అక్కడ నర్సుగా ఉన్న యువతి అధికారులకు డాక్టర్‌ లేరు, పనిమీద బయటకు వెళ్లారు అని చెప్పింది. దీంతో వైద్య అధికారులు ఆస్పత్రి భవనంలోకి వెళ్లి రోగులకు చికిత్స చేసే మిషన్లు, బెడ్‌లు, ఓపీ పరీక్షలు చేసే గది, శతక్కోప్‌ తదితర వాటిని చూసి నివ్వెరపోయారు. 

మరిన్ని వార్తలు