అక్షర యోధుడికి అంతిమ వీడ్కోలు

20 Oct, 2013 03:26 IST|Sakshi
అక్షర యోధుడికి అంతిమ వీడ్కోలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అక్షర యోధుడికి అభిమాన సంద్రం నీరాజనాలు పలికింది. సాహితీ క్షేత్రంలో మేరునగధీరుడై వెలుగొందిన రచయిత, పాత్రికేయుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజకు శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనేక మంది ప్రముఖులు, సాహితీవేత్తలు, అభిమానులు రావూరిని కడసారి సందర్శించి నివాళులర్పించారు. బతుకంతా అక్షరమై వరద గోదారులు సృష్టించిన సాహితీమూర్తికి తెలుగు ప్రపంచం వీడ్కోలు పలికింది.

 

తొలుత హైదరాబాద్‌లోని విజయ్‌నగర్ కాలనీలోని భరద్వాజ నివాసం నుంచి హుమాయూన్‌నగర్ దేవునికుంట హిందూ శ్మశాన వాటిక వరకు ఆయన అంతిమయాత్రకు అభిమానులు తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా స్వయంగా భరద్వాజ అంత్యక్రియల ఏర్పాట్లను  పర్యవేక్షించారు. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. అనంతరం భరద్వాజ కుమారులు గోపీచంద్, కోటేశ్వర్‌రావు, కుటుంబసభ్యుల అశ్రునయనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
 
 పరామర్శల వెల్లువ...
 
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొణతాల రామకృష్ణ, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సోమయాజులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ నాయకుడు నారాయణ, బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సహా పలువురు ప్రముఖులు హాజరై భరద్వాజ భౌతికకాయానికి నివాళులర్పించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రి వట్టి వసంతకుమార్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ఆకాశవాణి అదనపు డెరైక్టర్ డాక్టర్ పి.జె.సుధాకర్, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డెరైక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్, ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, విశాలాంధ్ర సంపాదకులు శ్రీనివాస్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ కవి అంద్శై దైవజ్ఞ శర్మ, లక్ష్మీపార్వతి, బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, గుదిబండి వెంకటరెడ్డి తదితరులు వారిలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు