ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంట్ కట్

30 Aug, 2013 03:58 IST|Sakshi

 వరంగల్, న్యూస్‌లైన్: సర్కారు వంచన మరోసారి రుజువైంది. పెంచి న విద్యుత్ ధరలపై ఆందోళన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అంటూ హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీ వెనక వేలాది ఆంక్షలు దాచి పెట్టింది. ఒక్కరికి కూడా ఉచిత విద్యుత్ వర్తించకుండా పాత యూనిట్లతో లంకె పెట్టింది. అంతేకాకుండా అప్పటి ఏళ్ల నాటి బకాయిలతో సహా మొత్తం వసూలు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. దీంతో విద్యుత్ అధికారులు ఇప్పుడు పేద వర్గాలపై పడ్డారు. జాబితా పట్టుకుని వంద రూపాయలు బాకీ ఉన్నా... సరఫరా నిలిపివేస్తున్నారు. తాజాగా వస్తున్న బిల్లులు కూడా పాత బాకీ కలుపుకుని బిల్లు ఎక్కువగా వస్తుండటంతో ఉచిత విద్యుత్‌కు అర్హులు కావడం లేదు. దీంతో జిల్లాలో ఈ నెలలో ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాల వినియోగదారులు ఉచిత విద్యుత్ పొందలేదు. గతంలో కూడా సర్కారు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచిత విద్యుత్ అంటూ పలుమార్లు ప్రకటనలు చేయడంతో దాదాపుగా నాలుగేళ్ల నుంచి బకాయిలు పెరిగిపోయాయి. ఒక్కో వినియోగదారునిపై వేల రూపాయల బిల్లులు పెండింగ్ పడ్డాయి.
 
 తిరకాసు నిబంధనలు
 ప్రభుత్వం ఈ ఉచిత విద్యుత్‌కు బోలెడన్నీ ఆంక్షలు విధించింది. పాత బాకీ ఒక్క రూపాయి ఉన్నా... ఉచితం వర్తించదు. పాత బాకీ మొత్తం చెల్లించాల్సిందే. 50 యూనిట్ల పరిమితికి ఒక్క యూనిట్ దాటినా రెండింతల బిల్లు చెల్లించాల్సిందే. అంతేకాకుండా గత నెలలో సుమారు 60 యూనిట్లు వాడుకుని... తాజాగా 50 యూనిట్లు వాడినా ఉచితం పరిధిలోకి వర్తించరు. ఇలా పాత బాకీలు... పాత యూనిట్లతో లంకె పెట్టింది. దీంతో నిరుపేద ఎస్సీ, ఎస్టీ వర్గీయులు కూడా ఈ ఉచిత విద్యుత్ పరిధిలోకి రావడం లేదు.
 
 జిల్లాలో ఇదీ పరిస్థితి
 జిల్లా వ్యాప్తంగా 980కి పైగా ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాలు, ఆవాస గ్రామాలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 97వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. అయితే మూడు, నాలుగేళ్లుగా ఈ వర్గాలకు ఉచిత విద్యుత్ అనే ప్రచారం సాగడం.. వారిని బిల్లులు కూడా అడగకపోవడంతో బిల్లులు పెండింగ్ పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల కనెక్షన్లపై *46 కోట్ల బకాయిలున్నాయి. ఈ నెలలో ఈ బిల్లులు మరో రూ.2 కోట్లు అదనంగా చేరాయి. అంటే ఈ నెలతో కలుపుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాలు చెల్లించాల్సిన మొత్తం బిల్లులు *48 కోట్లు. ప్రభుత్వం నుంచి పాత బకాయిల వసూళ్లకు ఆమోదం రావడంతో ఆ బిల్లులన్నీ వసూలు చేసే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ అధికారులు నాలుగైదు పర్యాయాలు నోటీసులు జారీ చేశారు. విజిలెన్స్ పోలీసులతో అరెస్ట్ వారెంట్లు కూడా ఇచ్చారు. ఉచిత విద్యుత్ ప్రకటనతో బిల్లు చెల్లించలేదని వినియోగదారులు నెత్తీనోరు బాదుకున్నా కనికరం చూపించడం లేదు. వేలల్లో ఉన్న బిల్లులు చెల్లించాల్సిందేనంటూ సరఫరా నిలిపివేస్తున్నారు.
 
 కరెంట్ తీసేశారు
 అప్పుడో మాఫీ అవుతాంది అన్నరు. ఇప్పుడు వచ్చేమో మొత్తం బిల్లు కట్టాలని కరెంట్ తీసేసిండ్రు. మూడేండ్ల నుంచి ఒక్క బుగ్గ, ఒక్క ఫ్యాన్‌తో కాలం గడిపాం. ఉచిత విద్యుత్ మాకు ఉందన్నరు. పోయిన నెలలో ఒక్కసారే *27వేల బిల్లు తెచ్చి చేతిలో పెట్టిండ్రు. కూలీనాలీ చేసుకుని బతుకుతున్నం. అంత బిల్లు మేమెక్కడ నుంచి కడుతాం. బిల్లు చెల్లించలేక ఇంట్లో చీకట్లోనే ఉంటున్నాం.
 - ఎర్ర చిన్నయ్య, లష్కర్ సింగారం
 
 తినడానికి తిండే లేదంటే...
 నాలుగు పందులను కాస్తే తప్పా నోటికి చేతందదు. ఉండటానికి ఇళ్లే సరిగా లేదు. కరెంట్ బిల్లు అని 2011 ఎనిమిదవ నెలల కరెంట్ కట్ చేసిండ్లు. అప్పుడు *3500 అప్పు చేసికట్టిన. ఎస్టీలకు బిల్లు లేదంటే వినలే. గప్పుడు దరఖాస్తు పెట్టమన్నరు. కాగితం రాసి ఇచ్చిన. ఇవాళ కరెంటోళ్లు మల్ల వచ్చిండ్లు.. *13 వేలు బిల్లు ఉన్నది. అని వైరు తీసేసిండ్లు. కరెంట్ బంద్ పెట్టినమని కాగితం చేతిల పెట్టిండ్లు, ఎస్సీ, ఎస్టీలకు బిల్లులు లేవని గవుర్‌మెంటోళ్లు చెప్పుతాంటే.. కరెంటోళ్లు బిల్లు అడగబట్టె. ఎట్లా బిల్లు కట్టాల్నో తెలుత్తలేదు. అప్పు కూడా పుట్టేటట్టులేదు.    - రాయపురి నర్సయ్య

మరిన్ని వార్తలు