రాయితీ గ్యాస్ పక్కదారి

23 Jan, 2014 00:16 IST|Sakshi
రాయితీ గ్యాస్ పక్కదారి
  •      వేంపాడులో వంట గ్యాస్ రాకెట్
  •      యథేచ్ఛగా రాయితీ గ్యాస్ అమ్మకం
  •      వ్యాపారులతో కుమ్మక్కయిన ఏజెన్సీలు
  •      విడిపించుకోని సిలెండర్లతో వ్యాపారం
  •      నాలుగు నెలల్లో 55 సిలెండర్ల స్వాధీనం
  •  
     రాయితీ గ్యాస్ సిలెండర్లు పక్కదారి పడుతున్నాయి. వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా నాలుగుకు మించి విడిపించని వారి సిలెండర్లు అధిక ధరకు అమ్ముడవుతున్నాయి. భారీగా సాగుతున్న ఈ వ్యవహారం వెనక గ్యాస్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. వేంపాడు కేంద్రంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. పౌర సరఫరాల శాఖ మొద్దు నిద్రలో జోగుతోంది.
     
    నక్కపల్లి, న్యూస్‌లైన్ : వేంపాడు కేంద్రంగా అక్రమ గ్యాస్ సిలెండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. తూర్పుగోదావ రి జిల్లా గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు, స్థానికులు, గ్యాస్‌ఏజెన్సీ నిర్వాహకులతో కుమ్మక్కయి గ్యాస్ సిలెండర్లను, రాయితీ గ్యాస్‌ను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఒక్కొక్క సిలెండర్‌పై రూ.800 నుంచి రూ.1000 లాభం వస్తోంది.
     
     కాసులు కురిపిస్తున్న రాయితీ గ్యాస్
     నాలుగు నెలల్లో హెచ్‌పీ, బారత్ గ్యాస్ కంపెనీలకు చెందిన 55 సిలెండర్లు వేంపాడు కూడలిలో పోలీసులకు పట్టుబడ్డాయి.
     
     ఈ వ్యాపారానికి సమీప గ్యాస్ ఏజెన్సీల సహకారం ఉందన్న ఆరోపణలున్నాయి.
     
     వినియోగదారులకు ప్రస్తుతం ఏటా 9 సిలెండర్లను రాయితీపై సరఫరా చేస్తున్నారు.
     
     చాలామంది దీపం లబ్దిదారులు ఏడాదికి నాలుగు సిలెండర్లకు మించి విడిపించుకోకపోవడం ఏజెన్సీలకు కాసులు కురిపిస్తోంది.
     
     ఇతర ప్రాంతాల నుంచి ఖాళీ సిలెండర్లను తీసుకొచ్చి జాతీయరహదారిని ఆనుకుని వేంపాడు సమీప ప్రాంతాల్లోని తోటలు, మారుమూల ప్రాంతాల్లో ఉంచుతున్నారు.
     
     ఈ వ్యాపారానికి వేంపాడు, ఉద్దండపురం గ్రామాలకు చెందిన కొందరి సహకారం ఉంది.
     
     డోర్ డెలివరీ పేరుతో ఏజెన్సీ నిర్వాహకులు కూడా తమ వాహనాల్లో నిండు సిలెండర్లను ఈ వ్యాపారం జరిగే స్థావరాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
     
     కొద్ది రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యాపారం ఇటీవల నక్కపల్లి పోలీసుల కంటపడింది.
     
     నాలుగు నెలల క్రితం ఎస్‌ఐ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు వేంపాడు కొత్తురు వద్ద 42 గ్యాస్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు.
     
     వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమమని గుర్తించి కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసారు. వీరిలో ఒకరు స్థానికుడు కాగా మరొకరు తునికి చెందిన వ్యాపారి.
     
     తాజాగా ఈనెల13వ తేదీన ఇదే వేంపాడు కూడలిలో ఆటోలో తీసుకొస్తున్న 14 ఖాళీ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు.
     
     కిరాణా వ్యాపారుల హస్తం
     వేంపాడుతోపాటు నక్కపల్లిలో కూడా పలువురు కిరాణా వ్యాపారులు అక్రమంగా సిలండర్లను నిల్వ ఉంచి ఏజెన్సీలతో కుమ్మక్కయి గ్యాస్ విడిపించి రూ.1200 నుంచి రూ.1500కి విక్రయిస్తున్నారు.
     
     ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారుల కంటపడకపోవడం ఆశ్చర్యకరం.
     
     ఈ నెల 13వ తేదీన పట్టుబడ్డ సిలెండర్లను పోలీసులు పౌర సరఫరాల శాఖాధికారులకు అప్పగించడంతో వాటిని తీసుకొచ్చిన వాహనం, వ్యక్తులపై 6-ఏ కేసు నమోదు చేశారు.
     
     ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి గ్యాస్ సిలెండర్ల రాకెట్ గుట్టు రట్టు చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు