అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు

20 Feb, 2020 17:45 IST|Sakshi

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, తాడేపల్లి: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని.. హడావుడిగా ఆస్తులను ప్రకటించడం వెనుక అనేక అనుమానాలు కలుగుతున్నాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రకటించిన ఆస్తులన్నీ డుప్లికేటేనని, ఐటీ విచారణలో నిజాలు బయటపడుతున్నాయనే కారణంతో ఆస్తులు ప్రకటించారని విమర్శించారు. ‘చంద్రబాబు పీఎస్‌ ఇంట్లోనే దాడులు చేస్తే.. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయి. 7 లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారు. విదేశాల్లో ఉన్న ఆయన బినామీ ఆస్తులు బయటపెట్టాలి’ అని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. (టీడీపీకి ఆ హక్కు లేదు)

హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదు..?
చంద్రబాబు చెప్పేవనీ శ్రీరంగనీతులు.. చేసేవన్నీ తప్పుడు పనులని శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు 100 తప్పులపై బీజేపీ ఛార్జ్‌షీట్‌ కూడా వేసిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతి సామ్రాట్‌ అని వామపక్షాలు పుస్తకం కూడా ముద్రించారన్నారు. అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారన్నారు. అమరావతి నుంచి అహ్మద్‌ పటేల్‌ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు.. కాంగ్రెస్‌కు ఎంత కప్పం కట్టారో బయటపడుతోందన్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి, కేసుల కోసమే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించారని ఆయన ఆరోపించారు.

త్వరలోనే ఆ మాఫియాను బయటపెడతాం..
‘పొత్తులు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఆయన చేసిన అవినీతికి దేవుడు కూడా కాపాడలేడు. భవిష్యత్తులో చంద్రబాబు జైలుకెళ్లక తప్పదు. రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఒక మాఫియాను సృష్టించారు. ప్రతి నెలా రూ.5కోట్లు పెట్టి మాఫియాను నడిపిస్తున్నారని’ శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే ఆ మాఫియా వివరాలు బయటపెడతామని ఆయన పేర్కొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును ఎల్లో మీడియా కాపాడుతుందని ధ్వజమెత్తారు. చంద్రబాబుది జనచైతన్య యాత్ర కాదని.. బినామీలను కాపాడుకునే యాత్రగా శ్రీకాంత్‌ రెడ్డి అభివర్ణించారు.
(‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’)

మరిన్ని వార్తలు