‘చెత్త’నగరం

13 Jul, 2015 02:59 IST|Sakshi
‘చెత్త’నగరం

- పారిశుధ్యంపై‘సమ్మె’ట
- త్వరలో తాగునీటి సేవలు బంద్
- చేతులేత్తేసిన అధికారులు
విజయవాడ సెంట్రల్ :
నగరాన్ని చెత్త ముంచెత్తుతోంది. ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మె ఆదివారానికి మూడోరోజుకు చేరింది. దీంతో  ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అంటువ్యాధులు ప్రబలుతాయోమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   నగరంలో రోజుకు 550 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ లెక్కన 1,650 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవ్వగా కేవలం 200 మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే పబ్లిక్‌హెల్త్ వర్కర్లు తొలగించగలిగారు. అంతర్గత రోడ్లు, ప్రధాన కూడళ్లలో చెత్త కుప్పలు మేట వేశాయి.

పటమట, వన్‌టౌన్ ప్రాంతాల్లో డ్రెయిన్ల నుంచి మురుగు పొంగి పొర్లుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిపై కార్మికుల్ని ఏర్పాటు చే ద్దామనుకున్న అధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈక్రమంలో ఎవరి చెత్త వారే ఎత్తుకోవాలంటూ కమిషనర్ జి.వీరపాండియన్ ఉచిత సలహా ఇచ్చి చేతులేత్తేశారు. స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోల సహకారం తీసుకోవాలని ప్రజారోగ్యశాఖాధికారులను ఆదేశించారు.

సమ్మె ఉధృతం
ప్రభుత్వంలో చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మెను ఉధృతం చేయాలని మునిసిపల్ వర్కర్ల యూనియన్ నేతలు నిర్ణయించారు. పట్టుబిగిస్తేనే సర్కార్ దిగివస్తోందని భావిస్తున్నారు. రాజకీయ పక్షాల భాగస్వామ్యాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. విపక్షాల సహకారంతో సమ్మెసెగను రగిలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రాజకీయ పక్షాలతో సమావేశాన్ని నిర్వహించాలని యూనియన్ నాయకులు నిర్ణయించారు. ఆదివారం వన్‌టౌన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ముట్టడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  సర్కార్‌తో తాడోపేడో తేల్చుకొనే వరకు సమ్మె కొనసాగించితీరతామని కార్మికులు  స్పష్టం చేస్తున్నారు. అత్యవసర సేవలైన తాగునీటి సరఫరాను బంద్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. నగరపాలక సంస్థలో తాగునీటి సరఫరా విభాగంలో 60 శాతం మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు సమ్మెబాటపడితే నగరవాసులకు నీటి ఇబ్బందులు తలెత్తె ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు