జెడ్పీ పీఠం ఈదరదే

8 Nov, 2014 14:46 IST|Sakshi
జెడ్పీ పీఠం ఈదరదే

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై వేసిన అనర్హత వేటును హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మళ్లీ జెడ్పీ పీఠంపై ఆసీనులు కానున్నారు. దీంతో పట్టుబట్టి అనర్హత వేటు వేయించిన తెలుగుదేశం నాయకులు ఈ అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.  కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఆదేశాలు వచ్చిన తర్వాత ఏం చేయాలనే అంశంపై అధికారులు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. విప్ ఇవ్వడంలోనే తప్పు చేసిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు తమ పొరపాటుకు నాలుక కరుచుకుంటున్నారు. కలెక్టర్ ఇచ్చిన అనర్హతపై జిల్లా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఈదర హరిబాబు అసలు విప్ చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు.

 

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విప్ ఇవ్వడంలో నిబంధనలు పాటించనందున చెల్లదని, చెల్లని విప్‌తో అనర్హత అంశమే రాదు కాబట్టి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యత్వం పునరుద్ధరించడంతో పాటు జిల్లాపరిషత్ చైర్మన్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ కారణంతో కేసు కొట్టేశారు....
 
 పార్టీ అధ్యక్షుడు స్థానిక నేతకు విప్ అధికారం కట్టబెడితే దాన్ని విప్‌గా వ్యవహరించే జెడ్పీటీసీ తమ పార్టీ సభ్యులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశంలో దీనికి భిన్నంగా జరిగింది. విప్‌ను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఇస్తే ఆయన జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌కు, జనార్దన్ పార్టీ సభ్యునికి విప్ అధికారం ఇచ్చారు. ఈ విధంగా చేయడం చట్టరీత్యా చెల్లదు. అయితే అధికార పార్టీ నిర్ణయం కావడంతో అధికారులు కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇదే అంశంపై కోర్టును ఆశ్రయించిన ఈదర హరిబాబుకు తీర్పు అనుకూలంగా వచ్చింది.
 
 అసలేం జరిగింది..
 
 అనూహ్య పరిణామాల మధ్య తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్ధి ఈదర హరిబాబు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే.  జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 31 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 25 జెడ్పీటీసీ స్థానాలు దక్కాయి. మెజారిటీ లేకపోయినా జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ చేయని ప్రయత్నం లేదు. ముగ్గురు వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలను ప్రలోభపెట్టి, వారిని తమవైపు తిప్పుకుంది. ఇరు పార్టీల బలాలు సమానం కావడంతో గొడవకు దిగి గత నెల ఐదున జరగాల్సిన ఎన్నిక వాయిదా పడటానికి కారణమైంది. ఎన్నికల కమిషన్ 13న ఎన్నిక జరపాలని నిర్ణయించింది.  జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఒంగోలు వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు జవ్వాజి రంగారెడ్డిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు సంతమాగులూరు వద్ద సినీఫక్కీలో అరెస్టు చేశారు. దీంతో సభలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది. అయితే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పొన్నలూరు జెడ్పీటీసీ ఈదర హరిబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా మద్దతు ప్రకటించడంతో ఆయన జెడ్పీ పీఠాన్ని అధిరోహించారు. అనంతరం విప్ ధిక్కరించారంటూ జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబుపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి ఆ పార్టీకి మద్దతు పలికిన కొత్తపట్నం, కారంచేడు, కంభం జెడ్పీటీసీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. జెడ్పీ చైర్మన్ హరిబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ వాదనలు విన్నారు. అసలు తాను విప్ తీసుకోలేదంటూ హరిబాబు వాదించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
 

మరిన్ని వార్తలు