‘చెన్నంపల్లి’లో తవ్వకాలపై వివరాలివ్వండి

31 Jan, 2018 02:03 IST|Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ వచ్చే వారానికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ ఎం.ఎస్‌.కె. జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను కర్నూలు జిల్లా, దూపాడుకు చెందిన బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాల పేరుతో చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని ఆయన హైకోర్టుకు లేఖ రాశారు. ఏసీజే సూచన మేరకు ఈ లేఖను పిల్‌గా మలచారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు