తుళ్లూరు వధూవరులకు భలే డిమాండ్

27 Dec, 2014 13:45 IST|Sakshi
తుళ్లూరు వధూవరులకు భలే డిమాండ్

*ఫొటోలతో తిరుగుతున్న మ్యారేజ్ బ్యూరోలు
*చదువు లేకపోయినా..  ఆస్తి ఉంటే చాలు..

 
విజయవాడ :  రాజధాని తుళ్లూరు అంటే మాటలా.. ఎన్నో వింతలు, విశేషాలు ఒకవైపు.. రియల్టర్లు, భూ యజమానులు, రైతుల హడావుడి మరోవైపైతే.. తాజాగా మ్యారేజ్ బ్రోకర్ల హవా కూడా ఇక్కడ నడుస్తోంది. ఒకప్పుడు తుళ్లూరులో పెళ్లి సంబంధమంటేనే.. ‘ఆ.. పెద్దగా చదువుకోరు ఏం అవసరం లేదులే..’ అనుకున్న పెళ్లి పెద్దలు ఇప్పుడు ఎగిరి గంతేసి మరీ ఒప్పుకొంటున్నారు. బ్రోకర్లకు ఫొటోలిచ్చి సంబంధం చూడమంటున్నారు.

 చదువు లేకపోయినా.. ఆస్తి తప్పనిసరి..

ఒకప్పుడు తుళ్లూరు సంబంధం అంటేనే వెనక్కి తగ్గేవారని, రాజధాని ప్రభావంతో ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని గుంటూరులోని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా సంబంధాల కోసం వస్తున్నారంటున్నారు. నాలుగైదు ఎకరాల భూమి ఉన్న కుర్రాడికి చదువు           లేకపోయినా చాలు తమ కుమార్తెను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.

విజయవాడ, గుంటూరులో ఐదారు ఇళ్లు ఉన్న యజమానుల కంటే.. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో రెండు మూడు ఎకరాల భూమి ఉన్న వారికి సంబంధం చూడటం సులభంగా ఉందని గుంటూరు పండరీపురం ఏరియాలోని ఒక మ్యారేజ్ లింక్స్  నిర్వాహకురాలు చెబుతున్నారు.

 బీటెక్ సంబంధాలున్నాయా..?
 రాజధాని ప్రభావం తుళ్లూరు రైతులపై బాగానే పడింది. గతంలో తమ కుమారుడికి మధ్య తరగతి ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడేవారు. ఇప్పుడు వరుడికి చదువు లేకపోయినా.. వధువు మాత్రం తప్పనిసరిగా బీటెక్ చదివి ఉండాలని ఆంక్షలు పెట్టడం విశేషం.

ఇక ఇటీవల ముగిసిన మ్యారేజ్ సీజన్‌లో తుళ్లూరులో జరిగిన వివాహాలు చూస్తే ఔరా..! అనక మానరు. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న రైతులు లక్షలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపించారు. ఆడపిల్లల తండ్రులు పెద్ద మొత్తంలో కట్నాలు సమర్పించడమే కాకుండా భారీగా, హుందాగా వివాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు