రైతుల గుండెల్లో హైటెన్షన్‌

30 Aug, 2018 07:43 IST|Sakshi

రాజధాని పరిధిలోని పొలాల్లో నుంచి వైర్లు లాగుతున్న అధికారులు

అడ్డుకున్న ఉండవల్లి రైతులు

అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్కే

తాడేపల్లిరూరల్‌: రాజధాని పరిధిలోని ఉండవల్లి రైతుల గుండెల్లో మళ్లీ హైటెన్షన్‌ పట్టుకుంది. బుధవారం తెల్లవారుజామునే హైటెన్షన్‌ వైర్లు లాగేందుకు సిబ్బంది గ్రామానికి వచ్చారు. ఇప్పటికే తమకున్న అతి తక్కువ స్థలంలో స్తంభాలు ఏర్పాటు చేస్తే ఎలా బతకాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వెనకడుగు వేసిన అధికారులు మళ్లీ హైటెన్షన్‌ వైర్లు లాగేందుకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే సంఘటన స్థలానికి వచ్చి పనులు చేస్తున్న సిబ్బందిని ఆపాలని సూచించారు. అనంతరం ఇరిగేషన్‌ డీఈతోను, మెగా కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్‌తోనూ ఆయన ఫోన్‌లో సంప్రదించారు. వెంటనే వారు సంఘటన స్థలానికి వచ్చారు. రైతుల అభిప్రాయం మేరకు మరో స్తంభం ఏర్పాటు చేయాలని ఆర్కే సూచించారు. ఇరిగేషన్‌ కొండవీటి వాగు ఎత్తుపోతల పథకం కాంట్రాక్టర్లు.. 

ఆ పని విద్యుత్‌ శాఖకు సంబంధించిందని తెలిపారు. వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి రైతుల బాధను అర్థం చేసుకోవాలని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే అక్కడ నుంచి వెళ్లిపోవడంతో 2 గంటల అనంతరం పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి వచ్చి హైటెన్షన్‌ వైర్లు లాగేందుకు ప్రయత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. విద్యుత్‌ శాఖ సిబ్బందికి, రైతులకు మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులను పిలిపించి బలవంతంగా వైర్లు లాగేందుకు ప్రయత్నం చేయగా.. మేం చావడానికైనా సిద్ధమంటూ రైతులు తేల్చి చెప్పారు.

 సంఘటన స్థలానికి తహసీల్దార్‌ వచ్చి, వైర్లు లాగాల్సిందేనన్నారు. రూ.5 లక్షలు ఖర్చు పెడితే 11 మంది రైతు కుటుంబాలను కాపాడిన వారవుతారంటూ స్థానికులు కోరారు.  పనులను అడ్డుకుంటే కేసు పెడతామని ఎమ్మార్వో హెచ్చరించారు. తమకు ఉన్న 10, 20 సెంట్లలో హైటెన్షన్‌ వైర్లు లాగితే మా జీవితాలు ఏం కావాలని రైతులు మండిపడ్డారు. గజాల్లో ఉన్న స్థలాల్లో మీరు ఎలా హైటెన్షన్‌ వైర్లు లాగుతారని ప్రశ్నించారు. చివరకు అన్ని శాఖల అధికారులు ఒకరికొకరు మాట్లాడుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ప్రత్యామ్నాయం ఉండగా రైతులను వేధిస్తున్న వైనం  
ఇరిగేషన్, రెవెన్యూ, ఎలక్ట్రికల్‌ అధికారులు ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ రైతులను వేధిస్తున్నారు. ఏర్పాటు చేసిన హైటెన్షన్‌ స్తంభాలకు మరో 100 గజాల దూరంలో మరో స్తంభం ఏర్పాటు చేస్తే రైతుల భూములు 5, 6 సెంట్లు మాత్రమే పోతుంది. అవి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎలక్ట్రికల్‌ అధికారులు కొంత అదనంగా ఖర్చు పెడితే రైతుల పొలాలను మినహాయించి వైర్లు ఏర్పాటు చేయవచ్చు. కానీ కాంట్రాక్టరుకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ, రైతుల పొలాల్లోంచి తీగలు లాగుతున్నారు. దానికి టెక్నికల్‌ ఇబ్బందులు ఉన్నాయంటూ కుంటిసాకు చెబుతూ అన్నదాతలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు