స్కూల్ బస్సుల్లో భద్రత ఎంత?

25 Jul, 2014 02:45 IST|Sakshi
స్కూల్ బస్సుల్లో భద్రత ఎంత?

 అరసవల్లి: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదం గురించి..తెలిసి చిక్కోలు ఉలిక్కిపడింది. తమ పిల్లలను బస్సుల్లో స్కూళ్లకు పంపిస్తున్నామని, మరి వాటిలో భద్రత ఎంత అన్న సందేహం తల్లిదండ్రులకు కలుగుతోంది.  జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు చెందిన బస్సుల నిర్వహణ తీరు విస్మయానికి గురి చేస్తోం ది. గత రెండు నెలల వ్యవధిలో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయంటూ..98 బస్సులపై కేసులు నమోదు చేసి, 24 బస్సులను సీజ్  చేశారంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు చెందిన 470 బస్సులు విద్యార్థులను తీసుకెళుతున్నాయి. రవాణాశాఖ అధికారులు తరచూ కొరడా ఝలిపిస్తున్నా.. కొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుభ వం, నైపుణ్యం కొరవడిన డ్రైవర్లను పెట్టుకోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా బస్సుల నిర్వహణలో అప్రమత్తత పాటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
 
 ముమ్మరంగా తనిఖీలు
 జిల్లా వ్యాప్తంగా స్కూల్, కాలేజీ బస్సులను రెండు నెలల నుంచి తనిఖీలు చేస్తున్నాం. ఎటువంటి లోపం ఉన్నా.. వెంటనే కేసు నమోదు చేస్తున్నాం.  నిబంధనలు  అతిక్రమిస్తే వెంటనే సీజ్ చేస్తున్నాం.  ఎటువంటి  ఇబ్బందులున్నా..తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయాలి.
 - ఎస్.వెంకటేశ్వరావు,
  రవాణాశాఖ ఉప కమిషనర్
 

మరిన్ని వార్తలు