సవాళ్లకు వెరవని వెట్రి సెల్వి

11 Apr, 2018 12:08 IST|Sakshi
ఐఏఎస్‌ అధికారిణి వెట్రి సెల్వి (ఫైల్‌ ఫోటో)

పదోన్నతిపై నెల్లూరు జేసీగా బదిలీ

హంద్రీ–నీవా సమస్యలపరిష్కారంలో చొరవ

వెట్రిసెల్వి.. దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా గుర్తింపు పొందిన మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా తనదైన శైలిలో రాణించారు. చిన్నవయస్సులోనే ఐఏఎస్‌  సాధించి.. కుప్పం స్పెషల్‌ ఆఫీసర్‌గానూ ప్రతిభ చూపారు. తాజాగా  జాయింట్‌ కలెక్టర్‌గా ఉద్యోగ ఉన్నతి పొంది నెల్లూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో సవాళ్లకు దీటుగా విధులు నిర్వహించి ఆమె మంచి గుర్తింపు పొందారు. 

మదనపల్లె : 2014 ఐఏఎస్‌ 143వ ర్యాంకు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా విధి నిర్వహణ. వృత్తి పరంగా ఎన్నో సవాళ్లు, మరెన్నో సమస్యలు. అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తూ, తనదైన శైలిలో రాణిస్తూ వెట్రిసెల్వి భూ సమస్యలెన్నింటినో పరిష్కరించారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గానే కాకుండా కుప్పం స్పెషల్‌ ఆఫీసర్‌గానూ అదనపు బాధ్యతలు స్వీకరించి సత్తా చూపారు. మదనపల్లెలో 16 నెలల పదవీకాలం పనిచేసి  నెల్లూరు జాయింట్‌ కలెక్టర్, అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌గా పదోన్నతిపై వెళ్లనున్నారు. 
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భూసమస్యలపై దృష్టి పెట్టారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అనేక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ, భూసమస్యలు, భాగ పరిష్కారాలు, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర సమస్యలు అధికంగా ఉండటంతో వాట న్నంటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కిందిస్థాయి సిబ్బం ది సహాయంతో, పై అధికారుల సూచనలతో ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించేందుకు కృషి చేశారు. 
జాతీయ రహదారి విస్తరణలో.. చొరవ 
మదనపల్లె నుంచి పలమనేరు వరకు ఎన్‌హెచ్‌-42 రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. పుంగనూరు పట్టణ ప్రజలు ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైపాస్‌ రోడ్డుకు అనుమతులు మంజూరు చేశారు. మదనపల్లె తట్టివారిపల్లె నుంచి పలమనేరు వరకు 54 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. అలాగే మదనపల్లె నుంచి తిరుపతి ఎన్‌హెచ్‌–71 ఫోర్‌లేన్‌లో భాగంగా మొదటివిడతలో 60 కిలోమీటర్ల పనులకు శంకుస్థాపన చేసి సర్వే పనులకు శ్రీకారం చుట్టారు.

హంద్రీ– నీవా పనుల్లో..
రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అపర భగీరథుడు వైఎస్సార్‌ ప్రారంభించిన హంద్రీ–నీవా కాలువ పనుల పూర్తిలో భాగంగా మదనపల్లె మండలం రామిరెడ్డిగారిపల్లె, చిప్పిలి తదితర ప్రాంతాల్లో భూసమస్యలపై కోర్టు వివాదాలు ఉంటే యజమానులతో చర్చించి, ప్రజావసరాల దృష్ట్యా కేసులు వెనక్కు తీసుకుని నిర్మాణానికి సహకరించడంలో చొరవ చూపారు. త్వరలో హంద్రీ–నీవా జలాలు మదనపల్లెకు రానున్నాయి.

కుంభకోణాల నిగ్గుతేల్చి..
పెద్దపంజాణి మండలంలో 400 ఎకరాల భూ కుంభకోణంలో సమగ్రంగా పరిశీలన చేసి, అక్రమాలను నిగ్గుతేల్చి మహిళా తహసీల్దార్‌ సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు. బి.కొత్తకోట మండలంలో హార్టికల్చర్‌ హబ్‌ నిర్మాణం కోసం బయ్యప్పగారిపల్లె–కోటావూరు గ్రామాల మధ్య 89ఎకరాల60సెంట్లు భూమిని కేటాయించారు. మదనపల్లె ఆటోనగర్, మైక్రో స్మాల్, మీడియం ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ కోసం ఏపీఐఐసీకి 80 ఎకరాలు కేటాయించారు. కుప్పం ఎయిర్‌పోర్టు కోసం 50 ఎకరాలు భూమిని సమీకరించి పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చొరవచూపారు. మదనపల్లె వాతారణం తనకెంతో ఇష్టమని, ఇక్కడ ఎదురైన సవాళ్లు కొత్త అనుభవాలను నేర్పాయని వెట్రిసెల్వి తెలిపారు.

మరిన్ని వార్తలు