చంద్రబాబును నమ్మితే నట్టేట మునగడం ఖాయం

21 Jan, 2015 01:34 IST|Sakshi
చంద్రబాబును నమ్మితే నట్టేట మునగడం ఖాయం

తుళ్ళూరు: తుళ్ళూరు మండలంలో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చేందుకు రైతులు ఏమాత్రం ఇష్టంగా లేరని, చంద్రబాబు మాటలు నమ్మి భూములు ఇస్తే నట్టేట  మునిగిపోతారేమోననే ఆందోళనలో రైతులు ఉన్నారని వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెని క్రిస్టినా చెప్పారు. తుళ్ళూరు మండలంలో ల్యాండ్ పూలింగ్ నిర్వహిస్తూ వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి తీసుకుంటున్న అధికారులు నోటి మాటతో అది ఇస్తాం, ఇది ఇస్తామని చెబుతూ రాతపూర్వకంగా ఎలాంటి ఆధారాలు ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.  

రైతులను భయపెట్టి బలవంతంగా భూములు తీసుకునేందుకు మండలంలో వందలాది పోలీసులను ప్రవేశపెట్టారని, ఎక్కడో పొలాల్లో దహన కాండ సృష్టించి ఆ నెపంతో వైఎస్సార్‌సీపీ నేతలను హింసపెట్టారని ధ్వజమెత్తారు.  ఉద్దండ్రాయునిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు నందిగాం సురేష్‌ను కూడా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. నందిగాం సురేష్‌ను, ఆయన కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో గత నెలలో ఎకరం పొలం ధర రూ. కోటిన్నర నుంచి రూ. కోటీ 80 లక్షల వరకు  ఉండగా, నేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రూ. కోటికి కూడా కొనేవారు లేక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కత్తెర సురేష్‌కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు, మండల నాయకులు కొమ్మినేని కృష్ణారావు, బత్తుల కిషోర్, డాక్టర్‌షరీఫ్, కంతేటి చినవెంకటేశ్వర్లు, నాయుడు నాగేశ్వరరావు, బత్తుల శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు