క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌

29 Nov, 2023 13:29 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్యాంప్ ఆఫీసు వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మురుగునీరు, చెత్త నిర్మూలన వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. స్వచ్ఛత ఉద్యమి యోజన పథకం కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు100 మురుగు శుద్ది వాహనాలను ఏపీ ప్రభుత్వం అందజేసింది.

రేపు నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో సీఎం పర్యటన 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్‌ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన అనంతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.

మరిన్ని వార్తలు