నిర్లక్ష్యాన్ని సహించను

14 Apr, 2015 03:49 IST|Sakshi

 అవసరమైతే తీవ్ర చర్యలకు వెనుకాడను
 ఇసుక, మట్టి తవ్వకాలపై తహశీల్దార్లకు కలెక్టర్ వార్నింగ్
 
 అమలాపురం టౌన్ : ‘జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు పెరుగుతున్నాయి. గణాంకాలు పరిశీలిస్తుంటే ఇసుక అనధికారికంగా తరలిపోతున్నట్లు తెలుస్తోంది. లంక భూముల్లో మట్టి తవ్వకాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ వీఆర్వోలను సస్పెండ్ చేశాం. ఇకనుంచి మిమ్మల్ని కూడా ఉపేక్షించేది లేదు. అవసరమైతే చార్జిషీట్లు జారీ చేసేందుకు కూడా వెనుకాడను. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సహించేది లేదు’ అని తహశీల్దార్లను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, అమలాపురం డివిజన్‌లోని తహశీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా జిల్లాలో పెచ్చుమీరుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై సీరియస్‌గా చర్చించారు. జిల్లాలో మట్టి తవ్వకాలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ ఆదేశించారు. డి-పట్టా భూములను కేవలం వ్యవసాయానికి మాత్రమే ఇస్తామని.. అందులో మట్టి తవ్వడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. మామిడికుదురు మండలం నుంచి ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. అక్కడ తక్షణ చర్యలు తీసుకోవాలని మామిడికుదురు తహశీల్దార్‌ను ఆదేశించారు. అలాగే కోనసీమలో సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో మట్టి తవ్వకాలు ఎక్కువగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు.
 
  సొంత భూముల్లో కూడా మట్టి తవ్వకూడదని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై ఇటీవల పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయని గుర్తు చేశారు. ఇకనుంచి ఈ అంశంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా, పత్రికల్లో కథనాలు వచ్చినా తహశీల్దార్లు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమలాపురం డివిజన్‌లో అనధికార చెరువులు తవ్వుతున్నారని కలెక్టర్ ప్రస్తావించారు. చేపలు, రొయ్యల చెరువులవల్ల పక్కన ఉన్న పంట పొలాలు దెబ్బతింటున్నాయని.. ఇటువంటిచోట్ల అక్రమ చెరువులను అదుపు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ పద్మ, ఆర్డీఓ గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
 తరలివచ్చిన జిల్లా అధికార యంత్రాంగం
 కలెక్టర్, జేసీ సహా వివిధ శాఖల జిల్లా అధికారులంతా సోమవారం అమలాపురం ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇక్కడ నిర్వహించిన ప్రజావాణిలో వారు పాల్గొనడంతో అర్జీదారులవద్దకు జిల్లా యంత్రాంగమంతా కదిలివచ్చినట్లు కనిపించింది. మండల స్థాయి ప్రజావాణిలో వినతి ఇచ్చినా, తమ సమస్య పరిష్కారం కాక, వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయలేకపోయిన ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఎప్పుడూ జిల్లా కేంద్రంలోనే ప్రజావాణి నిర్వహించే సంప్రదాయాన్ని కొద్దిగా మార్చి, ఒక్కో వారం ఒక్కో డివిజన్‌కు జిల్లా అధికార యంత్రాంగమంతా తరలివచ్చే ఏర్పాట్లు చేశారు.
 

మరిన్ని వార్తలు