టీడీపీలో ఐటీ కలకలం

31 Jan, 2020 04:51 IST|Sakshi

ప్రముఖ పొగాకు వ్యాపారి ఆస్తుల విక్రయాల్లో భారీగా కమీషన్‌ తీసుకున్న టీడీపీ నేత! 

విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు స్వాధీనం   

సాక్షి, గుంటూరు/పాత గుంటూరు: గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ పొగాకు గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై రెండు రోజులుగా ఐటీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా రెండు పొగాకు కంపెనీల మధ్య రూ.వందల కోట్ల ఆస్తుల క్రయవిక్రయాల్లో గుంటూరు అర్బన్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మధ్యవర్తిత్వం చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ టీడీపీ నాయకుడిని ఒక రోజంతా ఐటీ అధికారులు విచారించినట్టు విశ్వసనీయ సమాచారం. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ టీడీపీ నాయకుడు వ్యాపార లావాదేవీల్లో అనేక అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి.

గుంటూరులోని దివాలా తీసిన ఓ పొగాకు వ్యాపారి తన ఆస్తులను విక్రయానికి పెట్టాడు. వాటిలో టీడీపీ నేత మధ్యవర్తిత్వం వహించాడని సమాచారం. రూ.వందల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తుల విక్రయాల్లో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద మధ్యవర్తిత్వం వహించిన టీడీపీ నేత భారీ మొత్తంలో కమీషన్‌ దండుకున్నట్టు సమాచారం. దీంతో  గుంటూరులోని సదరు టీడీపీ నేత ఇళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, ఆయన బినామీగా ఉన్న మరో వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

ఓ ఇంట్లోని గోడల్లో ఏవో వస్తువులు ఉన్నట్టు మెటల్‌ డిటెక్టర్‌ బృందం గుర్తించగా అక్కడి నుంచి బృందాన్ని వెనక్కు పంపాక గోడలను బద్దలు కొట్టిన అధికారులు సుమారు 30 కేజీల వరకూ బంగారు తీగలు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఈయన ఇంటిపై ఐటీ సోదాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు